English | Telugu

స్టార్‌ హీరో చేష్టలపై ఎట్టకేలకు స్పందించిన హీరోయిన్‌!

సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటారు. వారి ప్రతి కదలికను అందరూ గమనిస్తుంటారు. విస్తృతంగా విస్తరించిన మీడియా వల్ల ఏ చిన్న తప్పు జరిగినా అది వైరల్‌ అయిపోవడం, పెద్ద వివాదంగా మారడం మనం చూస్తున్నాం. అలాంటి ఓ ఘటన ఇటీవల జరిగింది. భోజ్‌పురి స్టార్‌ హీరో పవన్‌ సింగ్‌, అంజలి రాఘవ్‌ కలిసి చేసిన ‘సైయా సేవ కరే’ అనే ఆల్బమ్‌ ప్రమోషన్‌ కోసం లక్నోలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంజలి రాఘవ్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన భోజ్‌పురి స్టార్‌ హీరో పవన్‌సింగ్‌ ఇప్పుడు ట్రోలింగ్‌కి గురవుతున్నారు. ఇది జరిగి రెండు రోజులవుతున్నా అంజలి స్పందించకపోవడంతో ఆమెను కూడా నెటిజన్లు ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. పవన్‌సింగ్‌ అలా ప్రవర్తించడం ఆమెకు ఇష్టం కాబట్టే ఏమీ మాట్లాడలేదని, పైగా స్టేజ్‌పై నవ్వుతూ కనిపించిందని రకరకాల కామెంట్స్‌ వచ్చాయి. దీనిపై ఎట్టకేలకు అంజలి రాఘవ్‌ స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్‌ చేశారు.

‘అనుమతి లేకుండా ఏ అమ్మాయిని తాకినా అది తప్పే అవుతుంది. ఆరోజు జరిగిన ఈ ఘటనతో నేను చాలా బాధపడ్డాను. ఆ ఈవెంట్‌లో నేను మాట్లాడుతున్న సమయంలో నా నడుముపై ఏదో ఉందని, దాన్ని తీసే క్రమంలో నన్ను తాకారనుకున్నాను. ఆరోజు కొత్త చీర కట్టుకోవడం వల్ల బ్లౌజ్‌కి సంబంధించిన ట్యాగ్‌ ఏదైనా బయటికి వచ్చిందేమో, అందుకే నన్ను తాకారేమోనని నేను నవ్వాను. అయితే అక్కడ ఏమీ లేదని ఆ తర్వాత నా టీమ్‌ మెంబర్‌ చెప్పారు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. దీని గురించి అతనితో పర్సనల్‌గా మాట్లాడాలనుకున్నాను. కానీ, ఈలోగా పవన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. హర్యానాలో ఇలాంటివి జరిగితే స్థానికులు వెంటనే స్పందిస్తారు. కానీ, నేనున్నది లక్నోలో. అది నా ప్రాంతం కాదు. పవన్‌సింగ్‌కి భారీగా నెట్‌వర్క్‌ ఉందని, దీని గురించి మాట్లాడొద్దని నన్ను బెదిరించారు. అందుకే ఆ తర్వాత కూడా నేను మౌనంగా ఉన్నాను. అలా ఉంటే ఇది సద్దుమణిగిపోతుందనుకున్నాను. కానీ, ఇది మరింత పెద్దదిగా మారింది. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చి జరిగింది చెప్తున్నాను. ఇది నన్ను ఎంతో బాధించింది. అందుకే ఇకపై భోజ్‌పురి సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాను’ అన్నారు అంజలి రాఘవ్‌. తాజాగా ఆమె చేసిన వీడియో కూడా వైరల్‌ అయింది. ఎంతో మంది ఆమెను సపోర్ట్‌ చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు. అదే సమయంలో పవన్‌సింగ్‌ను తప్పు బడుతూ అతనిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.