Read more!

English | Telugu

షారుఖ్ - అట్లీ.. ముహూర్తం అప్పుడేనా?

`చెన్నై ఎక్స్ ప్రెస్` (2013) త‌రువాత బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఆ స్థాయి విజ‌యాన్ని మ‌ళ్ళీ చూడ‌నేలేదు. `హ్యాపీ న్యూ ఇయ‌ర్`, `దిల్ వాలే`, `ఫ్యాన్`, `డియ‌ర్ జింద‌గీ`, `రీస్`, `జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్`, `జీరో`.. ఇలా షారుఖ్ నుంచి వ‌చ్చిన సినిమాలేవీ స‌గ‌టు ప్రేక్ష‌కుల‌నే కాదు అభిమానుల‌ను కూడా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో.. `జీరో` త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్నాడు షారుఖ్.

ప్ర‌స్తుతం `ప‌ఠాన్` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరాణి కాంబినేష‌న్ లోనూ ఓ మూవీ చేయ‌బోతున్నాడు. మ‌రోవైపు `లాల్ సింగ్ ఛ‌ద్దా`, `టైగ‌ర్ 3` చిత్రాల్లో అతిథి వేషాల్లోనూ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు.

ఇదిలా ఉంటే.. కోలీవుడ్ కెప్టెన్ అట్లీ కాంబినేష‌న్ లోనూ షారుఖ్ ఓ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నట్లు చాన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఆగ‌స్టు నుంచి ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ప‌ట్టాలెక్క‌నుంద‌ట‌. ఆపై శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి 2022 ద్వితీయార్ధంలో సినిమాని జనం ముందుకు తీసుకువ‌స్తార‌ట‌. మ‌రి.. చెన్నై ద‌ర్శ‌కుడితో `చెన్నై ఎక్స్ ప్రెస్` హీరో చేయ‌బోతున్న ఈ ప్ర‌య‌త్నం ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.