English | Telugu
అమితాబ్ లెటర్ చూసి ఏడ్చేసిన సయామీ!
Updated : Aug 20, 2023
ఘూమర్‌లో తన పెర్ఫార్మెన్స్ చూసి అమితాబ్ రాసిన లెటర్ చదివి ఏడ్చేశారట సయామీ ఖేర్. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అభిషేక్ బచ్చన్, సయామీ ఖేర్ నటించిన స్పోర్స్ట్ డ్రామా ఘూమర్. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి చాలా మంచి స్పంద వస్తోంది. ఇందులో అభిషేక్ బచ్చన్ క్రికెట్ కోచ్‌గా నటించారు. ఇందులో పారా ప్లెగిక్ స్పోర్ట్స్ ఉమెన్‌గా నటించారు సయామీఖేర్.
అన్నీ అడ్డంకులను దాటుకుని గెలిచి చూపించిన మగువ కథగా తెరకెక్కించారు. ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే అన్నిటిలోకీ అమితాబ్ రాసిన లేఖ చాలా మనసుకు హత్తుకుందని అన్నారు సయామీ ఖేర్.
ఆమె మాట్లాడుతూ ``చాలా మంది సినిమా చూసి ప్రశంసిస్తూనే ఉన్నారు. మొన్న సాయంత్రం అమితాబ్ నుంచి ఓ లెటర్ వచ్చింది. దాన్ని చదువుతుంటే నాకు ఏడుపు ఆగలేదు. నా నటనకు స్టాంప్ వేసి అప్రూవ్ చేసినట్టు అనిపించింది. నా దృష్టిలో అది హయ్యస్ట్ కాంప్లిమెంట్`` అని అన్నారు.
"హర్ష భోగ్లే,వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ సినిమా చూసినంత సేపు కన్నీళ్లు పెట్టుకున్నారట. కొన్ని థియేటర్లలో ఆడియన్స్ స్పందనని నేరుగా చూశాను. ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. ఏడాదిన్నర పాటు మేం పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఎక్కడికి వెళ్లినా జనాలు అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు" అని అన్నారు.
ఆర్.బాల్కీ దర్శకత్వం వహించిన సినిమా ఇది. యాక్సిడెంట్‌లో చేయి పోగొట్టుకున్న అమ్మాయిగా నటించారు సయామీఖేర్. అలాంటి అమ్మాయి తన కోచ్ సాయంతో ఎలా క్రికెట్ ఆడిందనేది సినిమా సబ్జెక్ట్. అంగద్ బేడీ, షబానా ఆజ్మీ కీ రోల్స్ చేశారు. శుక్రవారం విడుదలైంది ఈ సినిమా.