Read more!

English | Telugu

రాఖీపై ఫ్రాడ్ కేస్‌.. ఖండించిన ఐట‌మ్ గాళ్‌!

 

ఐట‌మ్ గాళ్‌, బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ రాఖీ సావంత్‌, ఆమె బ్ర‌ద‌ర్ రాకేశ్ రూ. 6 ల‌క్ష‌ల ఫ్రాడ్ కేసులో కొంత‌కాలంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కేసులో త‌న‌కు ఎలాంటి ప్ర‌మేయం లేద‌ని తాజాగా రాఖీ ఖండించింది. బిగ్ బాస్ 14 నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిందో లేదో సోద‌రుడు రాకేశ్‌తో క‌లిసి ఓ ఫ్రాడ్ కేసులో వార్త‌ల్లో నిలిచింది. ఆ ఇద్ద‌రూ త‌న‌ను రూ. 6 ల‌క్ష‌ల మేర మోసం చేశార‌ని ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఆరోపించారు. బుధ‌వారం ఆ వార్త మ‌రోసారి బ‌య‌ట‌కు రావ‌డంతో సోష‌ల్ మీడియాలో రాఖీ సావంత్‌ను ట్రోల్ చేస్తూ విప‌రీతంగా కామెంట్లు వ‌స్తున్నాయి.

శైలేష్ శ్రీ‌వాస్త‌వ అనే ఆ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం రాఖీ, రాకేశ్‌, వారి ఫ్రెండ్ రాజ్ ఖత్రిల‌కు అప్పు ఇచ్చాడు. దానికి సంబంధించి వారు అత‌డికి చెల్ల‌ని చెక్కు ఇచ్చారు. పోలీసులు ఆ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ దాఖ‌లు చేయ‌డంతో, రాఖీ సావంత్ ఈ ఫ్రాడ్ కేసును పూర్తిగా ఖండించారు. ఇది ప‌బ్లిసిటీ స్టంట్ త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని చ‌ట్ట‌ప్ర‌కారంగానే తేల్చుకుంటాన‌ని చెప్పారు.

ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఖీ ఈ కేసుపై స్పందిస్తూ, "ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా న్యాయ బృందం త్వరలో పరువు నష్టం దావా వేస్తుంది. ఇది పబ్లిసిటీ స్టంట్. దీనిపై మా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది." అని చెప్పింది. రాఖీ సోదరుడు రాకేశ్ ఇంకా స్పందించలేదు. 

ఈ కేసు సారాంశం ఏమంటే, బాబా గుర్మీత్ రామ్ రహీమ్ జీవితంపై ఒక చిత్రాన్ని రూపొందించడానికి రాఖీ సావంత్ సోదరుడు రాకేశ్‌ తన స్నేహితుడు రాజ్ ఖత్రి ద్వారా శైలేష్ శ్రీవాస్తవ నుండి డబ్బు తీసుకున్నాడు. వికాస్‌పురిలో ఒక డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా ప్రారంభించాడు. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో రాఖీ భాగం కానుంది.

శైలేష్ నుంచి డ‌బ్బు తీసుకున్న రాకేశ్‌, రాజ్.. ఆయ‌న‌కు రూ. 7 ల‌క్ష‌ల విలువ చేసే పోస్ట్‌-డేటెడ్ చెక్కు ఇచ్చారు. కానీ దానిపై త‌ప్పుడు సంత‌కాలు చేశారు.  2017లో ఈ కేసు న‌మోదు కాగా, ఇప్పుడు మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది.