English | Telugu

రాజ్ కుంద్రా కేసు.. 90 అశ్లీల చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన ఉద్యోగి!

అశ్లీల చిత్రాల‌ను రూపొందించి వాటిని మొబైల్ యాప్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసిన కేసులో ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ యాక్ట్‌లలోని వివిధ సెక్ష‌న్ల కింద శిల్పాశెట్టి భ‌ర్త‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు జూలై 19న అరెస్ట్ చేశారు. ఈరోజుతో ఆయ‌న పోలీస్ట్ క‌స్ట‌డీ ముగియ‌నుంది. తాజాగా ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక కీల‌క‌ సాక్షిని క‌నుగొన్నారు. 90 అశ్లీల చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన వ్య‌వ‌హారంలో అత‌ను పాల్గొన్న‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది.

ఆ వ్య‌క్తి పేరు అర‌వింద్ శ్రీ‌వాస్త‌వ‌. రాజ్ కుంద్రా కంపెనీలో అత‌ను ఉద్యోగి. గ‌త రెండేళ్ల కాలంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో దాదాపు 90 పోర్నోగ్రాఫిక్ ఫిలిమ్స్‌ను అత‌ను పంపిణీ చేశాడు. ఇదే కాదు, కుంద్రా కంపెనీకి చెందిన ఒక వాట్సాప్ గ్రూప్‌లో అర‌వింద్ స‌భ్యుడు. కుంద్రాకు, కాన్పూర్‌లో నివాసం ఉంటున్న అర‌వింద్ ఫ్యామిలీకి మ‌ధ్య క‌నెక్ష‌న్ ఉన్న‌ట్లు పోలీసులు క‌నుగొన్నారు. కుంద్రా కంపెనీ నిర్మించిన అశ్లీల చిత్రాలు, బిట్ల‌ను డిస్ట్రిబ్యూట్ చేయ‌డంలో అర‌వింద్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. అత‌నితో పాటు అత‌ని కుటుంబ‌స‌భ్యుల బ్యాంక్ అకౌంట్ల స్టేట్‌మెంట్స్‌ను క్రైమ్ బ్రాంచ్ ప‌రిశీలించింది.

ఈ సంద‌ర్భంగా కోట్లాది రూపాయ‌ల‌ను త‌న భార్య హ‌ర్షిత శ్రీ‌వాస్త‌వ‌, తండ్రి న‌ర్వ‌దా శ్రీ‌వాస్త‌వ బ్యాంక్ అకౌంట్ల‌కు అర‌వింద్ ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు వెల్ల‌డైంది. ఈ కేసులో త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. అర‌వింద్‌, అత‌ని సంబంధీకుల‌ను అన్వేషించ‌డానికి కాన్పూర్‌కు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన రెండు బృందాలు త‌ర‌లివెళ్లాయి. అర‌వింద్ సొంత ప్రొడ‌క్ష‌న్ కంపెనీని కూడా ఏర్పాటుచేసిన‌ట్లు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. కాగా, అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి పాత్ర‌ల‌ను నిగ్గుతేల్చ‌డానికీ, ఈ వ్య‌వ‌హారంలో చేతులు మారిన డ‌బ్బు విష‌యాన్ని శోధించ‌డానికీ ఒక ఫైనాన్షియ‌ల్ ఆడిట‌ర్‌ను క్రైమ్ బ్రాంచ్ నియ‌మించింది.