Read more!

English | Telugu

3 రోజుల్లో హిందీ 'పుష్ప' వ‌సూళ్లు రూ. 12 కోట్లు!

 

'పుష్ప‌'గా అల్లు అర్జున్ హిందీ బెల్ట్‌ను కూడా ఉర్రూత‌లూగిస్తున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప: ది రైజ్' హిందీ వెర్ష‌న్ అంచ‌నాల‌ను మించి ట్రేడ్ విశ్లేష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ విడుద‌లైన మూడో రోజు రూ. 5 కోట్ల నెట్ క‌లెక్ష‌న్లు సాధించింది. స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోయినా, మార్కెట్లో హాలీవుడ్ క్రేజీ ఫిల్మ్ 'స్పైడ‌ర్‌మ్యాన్ నో వే హోమ్' ఉన్నా, స్క్రీన్లు త‌క్కువ‌గా ల‌భించినా మూడో రోజు రూ. 5 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించ‌డం పెద్ద విశేషంగా చెప్తున్నారు. మ‌ల్టీప్లెక్సుల‌లో డీసెంట్ క‌లెక్ష‌న్లు సాధించిన ఈ సినిమా, సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో క్ర‌మేణా ఎక్కువ వ‌సూళ్లు సాధిస్తోంది.

విడుద‌లైన మూడు రోజులకు దేశంలో 'పుష్ప' హిందీ వెర్ష‌న్ క‌లెక్ష‌న్ రూ. 12 కోట్ల నెట్‌కు చేరుకుంది. తొలిరోజు రూ. 3 కోట్లు, రెండో రోజు రూ. 4 కోట్ల‌ను ఈ మూవీ వ‌సూలు చేసింది. మ‌హారాష్ట్ర‌లో థియేట‌ర్ల‌లో 50 శాతం ఆక్యుపెన్సీతోటే 'పుష్ప‌'కు ఈ రేంజ్ వ‌సూళ్లు రావ‌డం అసాధార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

Also read: పుష్ప‌.. అంచ‌నాల‌ను మించి ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాబ‌ట్టిన హిందీ వెర్ష‌న్‌!

కూలివాడి నుంచి ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్‌గా ఎదిగే పుష్ప‌రాజ్ క‌థ‌తో సుకుమార్ తీసిన 'పుష్ప' మూవీని హిందీ ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా అల్లు అర్జున్ మార్కెట్ పెరుగుతోంద‌నేందుకు సంకేత‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. నిజానికి హిందీ వెర్ష‌న్‌కు నిర్మాత‌లు పెద్ద‌గా ప్ర‌మోష‌న్ నిర్వ‌హించింది లేదు. కేవ‌లం యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన సాంగ్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తోటే 'పుష్ప‌'పై హిందీ ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 

Also read: మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబ‌లి రికార్డ్ సృష్టించిన 'పుష్ప‌'!

సినిమా విడుద‌ల‌య్యాక టైటిల్ రోల్‌లో బ‌న్నీ ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం వారిని అమితంగా ఆక‌ట్టుకుంటోంద‌ని వ‌సూళ్లు తెలియ‌జేశాయి. మ‌హారాష్ట్ర‌లోని మాస్ ఏరియాల్లో 'పుష్ప‌'ను చూసేందుకు ప్రేక్ష‌కులు అధిక సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. సెకండ్ లాక్‌డౌన్ త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో థియేట‌ర్లు తెరుచుకున్నాక మూడు రోజుల‌కు రూ. 12 కోట్ల వ‌సూళ్లు రావ‌డం.. అదీ ఒక డ‌బ్బింగ్ మూవీకి రావ‌డం.. అసాధార‌ణ విష‌యంగా పేర్కొంటున్నారు. అలా అంచ‌నాల‌ను మించి హిందీ బెల్ట్‌లో స‌త్తా చాటాడు అల్లు అర్జున్‌.