Read more!

English | Telugu

న్యూయార్క్‌లో సొంత రెస్టారెంట్‌ను స్టార్ట్ చేసిన ప్రియాంక‌

 

ప్రియాంకా చోప్రా న్యూయార్క్ సిటీలో సోనా అనే భారతీయ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆమె భ‌ర్త‌ నిక్ జోనాస్‌తో కలిసి పూజలు చేస్తున్న ఫొటోల‌ను కూడా పంచుకున్నారు.

గ్లోబ‌ల్ స్టార్‌ ప్రియాంకా చోప్రా జోనాస్ న్యూయార్క్‌లో తన సొంత రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ రెస్టారెంట్‌ భారతీయ వంటకాలను అందిస్తుంది. ఈ రెస్టారెంట్‌‌లో అందించే భార‌తీయ ఆహారాన్ని త‌న ప్రేమ‌తో అందిస్తున్న‌ట్లు చెప్పిన ఆమె, దానికి సోనా అని పేరు పెట్టానని తెలిపారు. ఈ నెలాఖరులో సోనా రెస్టారెంట్ ప్రారంభం కానున్న‌ది.

"న్యూయార్క్ సిటీలో సోనా అనే కొత్త‌ రెస్టారెంట్‌ను మీకు అందిస్తుండ‌టం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో నేను భారతీయ ఆహారం పట్ల నాకున్న ప్రేమను చూపిస్తున్నాను. భారతదేశంలోని కాలానికి అతీత‌మైన‌, నేను పెరిగిన రుచుల తాలూకు స్వరూపం సోనా. ఇక్క‌డి వంట‌గ‌దిని ఇన్‌క్రెడిబుల్‌ చెఫ్ అయిన‌ హరినాయక్ అనే మాస్టర్‌ఫుల్ టాలెంట్ చూసుకుంటారు. ఆయ‌న‌ అత్యంత రుచికరమైన, వినూత్నమైన మెనూను సృష్టించారు. ఇది నా అద్భుతమైన దేశం గుండా మిమ్మల్ని ఆహార ప్రయాణంలోకి తీసుకువెళుతుంది. ఈ నెల చివర్లో సోనా తెరుచుకుంటుంది. అక్కడ మిమ్మల్ని చూసేందుకు ఎదురు చూస్తుంటాను!” అని ప్రియాంక ట్వీట్ చేశారు.

భర్త నిక్ జోనాస్‌తో కలిసి పూజలు చేస్తున్న కొన్ని ఫొటోల‌ను కూడా ఆమె షేర్ చేశారు. ఆమె ఇంకా, “నా స్నేహితులు ఎం.కె. గోయ‌ల్‌, డేవిడ్ రాబిన్‌ నాయకత్వం లేకుండా ఈ ప్రయత్నం సాధ్యం కాదు. ఈ హోట‌ల్ డిజైన‌ర్ మెలిస్సా బోవర్స్, మిగ‌తా టీమ్‌కు థాంక్స్‌." అని రాసుకొచ్చారు.

ప‌ని విష‌యానికి వ‌స్తే, ప్రియాంక ఇటీవల ఓటీటీలో విడుద‌లైన “ది వైట్ టైగర్” లో కనిపించారు. రామిన్ బహ్రానీ దర్శకత్వం వహించిన ఈ డిజిట‌ల్ ఫిల్మ్‌లో రాజ్‌కుమార్ రావ్‌, ఆద‌ర్శ్ గౌర‌వ్ కీల‌క పాత్ర‌ధారులు.