Read more!

English | Telugu

ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’తో బాలీవుడ్‌లోనూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తాడట!

టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ తన అభిమాన గణాన్ని పెంచుకునేందుకు ఎన్టీఆర్‌ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘దేవర’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌. ఈ సినిమా తర్వాత హృతిక్‌రోషన్‌తో కలిసి చేయనున్న హిందీ సినిమా ‘వార్‌2’ కోసం బాలీవుడ్‌కి వెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వార్‌2’ షూటింగ్‌ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం హృతిక్‌రోషన్‌కి సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. 

జనవరి 10న హృతిక్‌రోషన్‌ తన 50వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. హృతిక్‌కి ఎన్టీఆర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సమయంలో వారిద్దరి సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది. ఇటీవల హృతిక్‌ ‘వార్‌2’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తూ ఎన్టీఆర్‌కి సంబంధించిన షూటింగ్‌ ఇంకా మొదలు కాలేదని, తనతో చేసే సీన్స్‌ షూటింగ్‌ త్వరలోనే మొదలవుతుందని తెలిపారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించే సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని హృతిక్‌ తెలిపారు. 

హృతిక్‌రోషన్‌ హీరోగా రూపొందిన ‘ఫైటర్‌’ ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ‘వార్‌2’ చిత్రం గురించి స్రస్తావించారు. మార్చి మొదటి వారంలో ‘వార్‌2’కి సంబంధించిన తాజా షెడ్యూల్‌ స్టార్ట్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ కూడా అప్పుడే ఆ సినిమా సెట్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఎన్టీఆర్‌, హృతిక్‌లపై వచ్చే ఇంటర్వెల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ఇప్పటికే నార్త్‌లో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్‌. ఇప్పుడు స్ట్రెయిట్‌ సినిమా ‘వార్‌2’తో అక్కడ మరింత ఫాలోయింగ్‌ సంపాదించుకోవాలన్నది ఎన్టీఆర్‌ ఆలోచన. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కూడా నటిస్తున్నాడని ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరో ‘వార్‌2’ సెట్స్‌కి వెళతాడా అని ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ‘వార్‌2’తో బాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడం  ఖాయమని అభిమానులు ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.