Read more!

English | Telugu

సీక్రెట్‌గా వీడియో తీస్తున్న ఫ్యాన్‌.. ఫోన్ లాగేసుకున్న యాక్ష‌న్ స్టార్‌!

 

రీల్ లైఫ్‌లో బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ జాన్ అబ్ర‌హాంను ఒళ్లు జ‌ల‌ద‌రించే యాక్ష‌న్ సీన్ల‌లో కండ‌ల‌వీరుడిగా అనేక‌సార్లు చూశాం. అత‌డిలోని కొంటెత‌నాన్ని అరుదుగా మాత్ర‌మే చూస్తూ వ‌చ్చాం. చాలా కాలం త‌ర్వాత రియ‌ల్ లైఫ్‌లో ఆ కొంటెత‌నాన్ని అభిమానులు చూస్తున్నారు. ఇటీవ‌ల ఇద్ద‌రు ల‌క్కీ ఫ్యాన్స్ ముంబైలో జాన్‌తో మాట్లాడే అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఈ సంద‌ర్భంగా జాన్ రెస్పాండ్ అయిన తీరును వారేమాత్రం ఊహించ‌లేక‌పోయారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. త‌మ వెనుక న‌డుచుకుంటూ వ‌స్తున్న జాన్ అబ్ర‌హాంను వారు దొంగ‌చాటుగా సెల్ఫీ వీడియో తీస్తున్నారు. వీడియోలో జాన్ షికారు కోసం వ‌చ్చిన‌ట్లుగా క‌నిపించాడు.

ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన జాన్ వారు త‌న‌ను వీడియో తీస్తున్న‌ట్లు గ‌మ‌నించి, చ‌టుక్కున ఆ ఫోన్ లాక్కుని వెళ్లిపోతూ క‌నిపించాడు. మొద‌ట వారు వీడియో తీస్తున్నందుకు ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్లు ముఖం పెట్టిన అత‌ను త‌ర్వాత ఆగి, ఆ ఫోన్‌లోనే "హాయ్‌, ఎలా ఉన్నారు?  హాయ్ యు గైస్ బాగున్నారా? అక్క‌డ నా ఫ్రెండ్ వున్నారు" అని న‌వ్వుతూ చెప్పి, ఆ ఫోన్‌ను తిరిగిచ్చేసి, న‌డుచుకుంటూ ముందుకు వెళ్లాడు. మొద‌ట ఫోన్ లాక్కున్న‌ప్పుడు స్ట‌న్న‌యిన ఆ ఇద్ద‌రు ఫ్యాన్స్ ఆ త‌ర్వాత జాన్ ప‌ల‌క‌రించిన విధానం, ఆ ఫోన్‌ను తిరిగిచ్చిన విధానానికి తెగ సంతోష‌ప‌డిపోయారు. 

ఆ వీడియో ఆన్‌లైన్‌లో తెగ షేర్ అయింది. జాన్‌లోని కొంటెత‌నానికీ, అత‌డిలోని విన‌య‌శీల‌త‌కూ ఆ వీడియో అద్దం ప‌డుతోందంటూ ప‌లువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్‌లోని టాప్ యాక్ష‌న్ హీరోస్‌లో ఒక‌డైన జాన్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవ‌లే అత‌ను మోహిత్ సురి 'ఏక్‌ విల‌న్ రిట‌ర్న్స్' మూవీ షూటింగ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మూవీలో అత‌నితో పాటు దిశా ప‌టానీ, అర్జున్ క‌పూర్‌, ఆదిత్య‌రాయ్ క‌పూర్‌, తార సుతారియా ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.