English | Telugu
తెలుగు సినిమాని తక్కువ చేస్తూ బాలీవుడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్
Updated : Mar 31, 2022
'బాహుబలి' తర్వాత తెలుగు సినిమా స్థాయి ఎన్నో రేట్లు పెరిగింది. హిందీ మార్కెట్ లోనూ మన సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. దీంతో బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ పోషిస్తున్న 'గాడ్ ఫాదర్'లో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపించాడు. తాను సౌత్ సినిమాలలో నటించడానికి ఎప్పుడూ సిద్ధమే అని చెప్పుకొచ్చాడు. అయితే మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం మాత్రం తన దృష్టిలో ప్రాంతీయ సినిమాలు తక్కువేనని, అసలు వాటిలో యాక్ట్ చేయనని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
జాన్ అబ్రహం నటించిన లేటెస్ట్ మూవీ 'ఎటాక్' ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో జాన్ అబ్రహం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్'లో జాన్ అబ్రహం కీ రోల్ చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఖండించిన ఆయన.. తాను ఏ తెలుగు సినిమాలోనూ నటించడం లేదని చెప్పాడు. తాను హిందీ హీరోనని, ఇతర భాషల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయనని అన్నాడు. అంతేకాదు, ఇతర యాక్టర్స్ లాగా డబ్బు కోసం తెలుగు లేదా ఇతర ప్రాంతీయ సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
జాన్ అబ్రహంపై సౌత్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. హిందీ సినిమాల్లో డబ్బులు తీసుకోకుండానే నటిస్తున్నావా?.. షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమాలో సపోర్టింగ్ రోల్ ఎందుకు చేస్తున్నావు? అంటూ విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ కంటే టాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ఆదరణ లభిస్తుందని తెలుసుకుంటే మంచిదని చురకలు వేస్తున్నారు.