English | Telugu

రీరిలీజ్‌ కలెక్షన్స్‌లో కొత్త రికార్డు సృష్టించిన సినిమా ఇదే!

ఇటీవలికాలంలో పాత సినిమాలు రీరిలీజ్‌ అయి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో మొదలైన ఈ ప్రక్రియ కోలీవుడ్‌కి కూడా చేరింది. అక్కడ కూడా టాప్‌ హీరోల పాత సినిమాలను రీరిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పుడీ సంప్రదాయం బాలీవుడ్‌లో కూడా మొదలైంది. రీరిలీజ్‌లో ఆడియన్స్‌ రెస్పాన్స్‌ను గమనిస్తున్న మేకర్స్‌ గతంలో ఫ్లాప్‌ అయిన సినిమాలను సైతం మళ్ళీ రిలీజ్‌ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటీవల తెలుగు, తమిళ్‌ భాషల్లో ఫ్లాప్‌ అయిన కొన్ని సినిమాలను రీరిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

2018లో బాలీవుడ్‌లో రిలీజ్‌ అయి ఫ్లాప్‌ అయిన ‘తుంబడ్‌’ అనే చిత్రాన్ని రీరిలీజ్‌ చేసి లాభాలు అందుకుంటున్నారు మేకర్స్‌. రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘తుంబడ్‌’ చిత్రం ఫస్ట్‌ రిలీజ్‌లో రూ.15 కోట్లు మాత్రమే కలెక్ట్‌ చేసి నిర్మాతలను నిరాశపరిచింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్‌ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓటీటీలో సూపర్‌హిట్‌ అవ్వడంతో సినిమాని థియేటర్లలో రీరిలీజ్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు మేకర్స్‌. రీరిలీజ్‌లో ‘తుంబడ్‌’ భారీగా కలెక్షన్లు రాబట్టింది. సోహుమ్‌ షా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాకి రాహి అనిల్‌ బార్వే, అనిల్‌ గాంధీ దర్శకత్వం వహించారు.

రీరిలీజ్‌లో ‘తుంబడ్‌’ కేవలం 11 రోజుల్లోనే రూ.33 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇది రీరిలీజ్‌లో ఒక రికార్డు అని చెప్పొచ్చు. ఇంతకుముందు దళపతి విజయ్‌ హీరోగా నటించిన ‘గిల్లి’ చిత్రం ఫుల్‌ రన్‌లో రూ.33 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్‌ 13న రీ రిలీజ్‌ అయిన ‘తుంబడ్‌’ కేవలం 11 రోజుల్లోనే ఆ రికార్డుని క్రాస్‌ చేసింది. ఇప్పటికీ కలెక్షన్స్‌ స్ట్రాంగ్‌గానే ఉండడంతో రీరిలీజ్‌లో ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.