English | Telugu

కార్తీక్ వెంట‌ప‌డ‌కండి.. సుశాంత్ లాగా ఉరేసుకొనేలా చేయ‌కండి!

భారీ అంచ‌నాలున్న 'దోస్తానా 2' మూవీ నుంచి ఓ హీరో అయిన కార్తీక్ ఆర్య‌న్‌ను నిర్మాత క‌ర‌ణ్ జోహార్ తొల‌గించ‌డం క్ర‌మేపీ కాంట్ర‌వ‌ర్సీని సంత‌రించుకుంటోంది. నెపోటిజం గ్యాంగ్ కార్తీక్ ఆర్య‌న్‌కు అన్యాయం చేసింద‌ని కొంత‌మంది క‌ర‌ణ్‌ను తిట్టిపోస్తున్నారు. ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ అయితే ఇంకో అడుగు ముందుకేసి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వెంట‌ప‌డి, అతడిని ఉరేసుకొనేలా చేసిన‌ట్లు కార్తీక్ ఆర్య‌న్ వెంట‌ప‌డొద్ద‌ని వేడుకుంది. ఈ మేర‌కు ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సూప‌ర్ హిట్ ఫిల్మ్ 'దోస్తానా'కు సీక్వెల్‌గా ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్ 'దోస్తానా 2' మూవీని ప్రారంభించాడు. కార్తీన్ ఆర్య‌న్‌, ల‌క్ష్ ల‌ల్వానీ హీరోలుగా, జాన్వీ క‌పూర్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. ఈ సినిమాతో కొలిన్ డికున్హా డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. గ‌త ఏడాది 20 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిగాక‌, లాక్‌డౌన్‌తో షూటింగ్‌ను నిలిపివేశారు. ఇప్పుడు సినిమా నుంచి కార్తీక్‌ను తొల‌గించారు. "వృత్తిప‌ర‌మైన ప‌రిస్థితుల కార‌ణంగా, డిగ్నిఫైట్ సైలెన్స్‌ను మెయిన్‌టైన్ చేస్తూ, కొలిన్ డికున్హా డైరెక్ట్ చేస్తున్న 'దోస్తానా 2'కు క్యాస్టింగ్‌లో మార్పులు చేయ‌బోతున్నాం. త్వ‌ర‌లో అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కోసం వెయిట్ చేయండి." అని ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌క‌టించింది.

బ‌య‌ట వినిపిస్తున్న దాని ప్ర‌కారం భ‌విష్య‌త్తులోనూ కార్తీక్‌తో అసోసియేట్ కాకూడ‌ద‌ని క‌ర‌ణ్ జోహార్ డిసైడ్ చేసుకున్నాడు. కార్తీక్ ప్రొఫెష‌న‌ల్‌గా బిహేవ్ చేయ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మంటున్నారు.

అయితే కార్తీక్ ఆర్య‌న్‌కు స‌పోర్ట్‌గా కంగ‌నా ర‌నౌత్ ముందుకు వ‌చ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చేసిన‌ట్లు అత‌డి విష‌యంలో చేయ‌వ‌ద్ద‌ని క‌ర‌ణ్ జోహార్‌కు ఆమె సూచించింది. "కార్తీక్ స్వ‌యంకృషితో ఈ స్థాయికి వ‌చ్చాడు, ముందు ముందు స్వ‌యంకృషితోనే ఎదుగుతాడు, పాపా జో, అత‌ని నెపో గ్యాంగ్ క్ల‌బ్‌కు చేసే ఒకే రిక్వెస్ట్ ఏమంటే ద‌య‌చేసి అత‌డిని ఒంట‌రిగా వ‌దిలేయండి. సుశాంత్‌కు చేసిన‌ట్లు అత‌డి వెంట‌ప‌డ‌కండి, ఉరేసుకొనేట్లు ఫోర్స్ చేయ‌కండి. రాబందుల్లారా అత‌డిని ఒంట‌రిగా వ‌దిలేయండి, నెపోస్‌లారా గెట్ లాస్ట్." అంటూ త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.