Read more!

English | Telugu

'నైవ్స్ ఔట్ 2'లో డేనియ‌ల్ క్రెగ్‌తో WWE స్టార్!

 

'నైవ్స్ ఔట్' సీక్వెల్‌లో ప్ర‌ధాన పాత్ర బెనోయిట్ బ్లాంక్‌ను ఒరిజిన‌ల్‌లో పోషించిన‌ డేనియ‌ల్ క్రెగ్ (జేమ్స్ బాండ్ పాత్ర‌ధారి) చేయ‌నుండ‌గా, లేటెస్ట్‌గా ఓ కీల‌క పాత్ర‌కు WWE స్టార్ డేవ్ బటిస్టా ఎంపిక‌య్యాడు. 'నైవ్స్ ఔట్' త‌దుప‌రి రెండు సీక్వెల్స్ విడుద‌ల చేయ‌డానికి ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ 400 మిలియ‌న్ డాల‌ర్ల (ఇండియ‌న్ క‌రెన్సీ ప్ర‌కారం 2939 కోట్ల రూపాయ‌లు) విలువ క‌ల డీల్‌ను కుదుర్చుకున్న‌ట్లు హాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి ఇది చారిత్రాత్మ‌క ఒప్పందంగా చెప్పుకుంటున్నారు. 

ఒరిజిన‌ల్‌ను రూపొందించిన రియాన్ జాన్స్‌న్ ఈ సీక్వెల్‌కు ర‌చ‌న చేస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అంతేకాదు త‌న భాగ‌స్వామి రామ్ బెర్గ్‌మ‌న్‌తో క‌లిసి ఈ సినిమాని నిర్మించ‌నున్నాడు. అయితే డీల్ విష‌య‌మై నెట్‌ఫ్లిక్స్ ఇంత‌దాకా ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. ఈసారి ప్లాట్ ఏమిట‌నేది వెల్ల‌డికాలేదు కానీ, అనేక‌మంది అనుమానితుల మ‌ధ్య మ‌రో మిస్ట‌రీని ప‌రిష్క‌రించ‌డానికి బెనోయిట్ బ్లాంక్ తిరిగొస్తాడ‌నేది తెలుస్తోంది. గ్రీస్‌లో త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వ‌నున్న‌ది. 

'గార్డియ‌న్స్ ఆఫ్ ద గాల‌క్సీ', 'ఆర్మీ ఆఫ్ ద డెడ్' మూవీస్‌లో హెవీ యాక్ష‌న్ రోల్స్ చేసిన బటిస్టా ఈ సినిమాలో చేసే రోల్ ఏమిట‌న్న‌ది తెలియ‌లేదు. 'నైవ్స్ ఔట్‌'లో మ‌నం అనేక ఫ‌న్ క్యారెక్ట‌ర్స్‌, న‌వ్వు తెప్పించే డైలాగ్స్ చూశాం కాబ‌ట్టి బటిస్టా కూడా అలాంటి ఫ‌న్ రోల్‌లో క‌నిపించ‌వ‌చ్చ‌ని ఊహిస్తున్నారు.