English | Telugu

మిథున్‌ చక్రవర్తికి అత్యుత్తమ పురస్కారం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోది!

కళారంగంలో ఉన్న వారికి అభినందనలు, పురస్కారాలు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. సినిమా రంగానికి విశేష సేవలు అందించిన ఎంతో మంది ప్రముఖులకు ఎన్నో పురస్కారాలు లభించాయి. వాటిలో దేశంలోనే అత్యుత్తమ పురస్కారంగా చెప్పుకునేది.. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు. ఈ ఏడాది ఈ అవార్డుకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తిని ఎంపిక చేసింది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. ఈ సమాచారాన్ని ఈరోజు ఉదయం ఒక అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

అక్టోబర్‌ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మిథున్‌ చక్రవర్తికి ఈ పురస్కారాన్ని అందిస్తారు. ఈ విషయం గురించి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ ఎక్స్‌ వేదికగా తెలియజేస్తూ ‘మిథున్‌ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు మిథున్‌ చక్రవర్తిని జ్యూరీ ఎంపిక చేసింది. ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం’ అని పోస్ట్‌ చేశారు. ఇదే సంవత్సరం మిథున్‌కు పద్మభూషణ్‌ అవార్డు లభించిన విషయం తెలిసిందే. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్రమోది.. మిథున్‌ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుకు ఎంపికైన సందర్భంగా లెజెండరీ యాక్టర్‌ మిథున్‌ చక్రవర్తి.. హిందీ, బెంగాలీ, కన్నడ, తెలుగు, తమిళ్‌, ఒరియా, భోజ్‌పురి, పంజాబీ భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించారు. పవన్‌కళ్యాణ్‌, వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘గోపాల గోపాల’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి రాక ముందు మిథున్‌ చక్రవర్తి ఓ నక్సలైట్‌. నక్సలైట్‌ కార్యకలాపాలు చేస్తున్న సమయంలోనే ఆయన సోదరుడు ఒక ప్రమాదంలో చనిపోయారు. దీంతో నక్సలైట్‌ జీవితానికి స్వస్తి పలికి సినిమా రంగంవైపు అడుగులు వేశారు. ఎన్నో భాషల్లో సినిమాలు చేసినప్పటికీ బాలీవుడ్‌ హీరోగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న మిథున్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 1980 దశకంలో అతని డాన్సులకు యూత్‌ ఫిదా అయిపోయేవారు.

1976లో మృణాల్‌ సేన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మృగయా’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు మిథున్‌. తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత హిందీ, బెంగాలీ సినిమాల్లో ఎక్కువగా నటించారు. రవికాంత్‌ నగాయిచ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సురక్ష’ అనే స్పైథ్రిల్లర్‌ అతనికి హీరోగా మంచి ఇమేజ్‌ని తెచ్చింది. 1979లో విడుదలైన ‘డిస్కో డ్యాన్సర్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా తిరుగులేని హీరోగా స్టార్‌డమ్‌ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కసమ్‌ పైదా కర్నేవాలేకి, డాన్స్‌ డాన్స్‌ చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. డాన్స్‌, యాక్షన్‌ ప్రధానంగా ఉన్న సినిమాలే కాకుండా కొన్ని సెంటిమెంట్‌ సినిమాలు కూడా చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యారు మిథున్‌. దాదాపు 50 సంవత్సరాలుగా సినిమా రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించడం పట్ల మిథున్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.