English | Telugu

బ‌డేమియా చోటేమియా షూటింగ్‌లో ప్ర‌మాదం!

బాలీవుడ్ ఖిలాడీ అక్ష‌య్‌కుమార్‌, యంగ్ టాలెంట్ టైగ‌ర్ ష్రాఫ్ క‌లిసి న‌టిస్తున్న సినిమా బ‌డేమియా చోటేమియా. గ‌తంలో ఇదే పేరుతో విడుద‌లై అత్య‌ద్భుతంగా ప్రజాద‌ర‌ణ పొందిన క‌థ‌తో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలోని ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది.

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం ఈ షూటింగ్‌లోనే ఉన్నారు. అలీ అబ్బాస్ జాఫర్ తెర‌కెక్కిస్తున్న యాక్షన్ చిత్రం బడే మియా చోటే మియా. భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. బడే మియా చోటే మియా సినిమాకు మేకప్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేస్తున్నారు శ్రవణ్ విశ్వకర్మ. ఈయ‌న‌పై చిరుతపులి దాడి చేసింది. ప్ర‌స్తుతం ముంబైలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

మేకప్ ఆర్టిస్ట్ శ్రవణ్ విశ్వకర్మ తన బైక్‌పై తన స్నేహితుడిని డ్రాప్ చేయడానికి వెళ్లగా, అతని బైక్ చిరుతపులిని ఢీకొట్టింది. ఘటన గురించి శ్ర‌వ‌ణ్‌ మాట్లాడుతూ, "నేను నా స్నేహితుడిని బైక్ మీద‌ డ్రాప్ చేయడానికి అక్క‌డికి వెళ్లాను. షూట్ లొకేషన్ నుంచి కొంచెం దూరం వెళ్ల‌గానే ఓ పంది రోడ్డు దాటింది. త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాను. బైక్ స్పీడ్ పెంచేసరికే ఓ చిరుత పందిని వెంబడించి పరుగెడుతున్నట్లు కనిపించింది. నా బైక్‌కి చిరుతపులి అడ్డు వ‌చ్చింది. వెంట‌నే యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత బైక్‌పై నుంచి కిందపడిపోయాను. చిరుతపులి నా చుట్టూ తిరుగుతున్నట్ట‌నిపించింది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో నాకు గుర్తులేదు. క‌ళ్లు తెరిచి చూసేస‌రికి హాస్పిట‌ల్‌లో ఉన్నాను. అక్క‌డున్న‌వారే న‌న్ను హాస్పిట‌ల్‌కి తీసుకొచ్చి ఉంటారు" అని అన్నారు. ఆయ‌న హాస్పిట‌ల్ ఖ‌ర్చుల‌ను మేక‌ర్స్ భ‌రిస్తున్నారు.

వాసు భగ్నాని, పూజా ఎంటర్‌టైన్‌మెంట్ తెర‌కెక్కిస్తున్న సినిమా బడే మియా చోటే మియా. వాసు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్, జాకీ భగ్నాని, హిమాన్షు కిషన్ మెహ్రా, అలీ అబ్బాస్ జాఫర్ నిర్మాత‌లు. 2023 క్రిస్మస్ సందర్భంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.