Read more!

English | Telugu

యునిసెఫ్ లో న‌టుడు ఆయుష్మాన్‌కి అరుదైన గౌర‌వం!

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాను జాతీయ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు యునిసెఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. బాల‌ల జీవితం, అభివృద్ధి, ర‌క్ష‌ణ‌, నిర్ణ‌యాలు వంటి విష‌యాల మీద యునిసెఫ్ లో త‌న గ‌ళాన్ని వినిపించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు ఆయుష్మాన్ ఖురానా. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశంలో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ, "యునిసెఫ్ కి భార‌త జాతీయ అంబాసిడర్‌గా ఎంపిక కావ‌డం ఆనందంగా ఉంది. బాలల హక్కుల కోసం మ‌రింత సంతోషంగా పోరాడుతాను. ఈ అవ‌కాశం రావ‌డం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలో పిల్లలు,  యుక్తవయస్కులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నాకు అవ‌గాహ‌న‌ ఉంది. ఈ విష‌యం గురించి నేను ఇప్ప‌టికే చాలా మందితో మాట్లాడాను. ఇంట‌ర్నెట్ యుగంలో పసిపిల్ల‌ల భ‌ద్ర‌త‌, సైబ‌ర్ నేరాలు, మాన‌సిక ఆరోగ్యం, బాల‌బాలిక‌ల స‌మాన‌త్వం గురించి కూడా నాకున్న అవ‌గాహ‌న‌ను అంద‌రితో పంచుకున్నాను. బాల‌బాలిక‌ల సంర‌క్ష‌ణ  కోసం ఎలాంటి కృషి చేయ‌డానికైనా సిద్ధంగా ఉన్నాను" అని అన్నారు.

సినిమా ఇండ‌స్ట్రీలో ఆయుష్మాన్ ఖురానాకు ప్ర‌త్యేకమైన స్థానం ఉంది. న‌లుగురితో నారాయ‌ణా అన్న‌ట్టు కాకుండా, ఆయ‌న ఎంపిక చేసుకునే స‌బ్జెక్టులు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఇప్ప‌టికే సొసైటీలో రొటీన్‌కి భిన్నంగా ఆలోచించేవారిని ఆయుష్మాన్ ఖురానాలాగా ఆలోచిస్తున్నార‌ని అంటున్నారు. విక్కీ డోన‌ర్‌ని హిందీలో చేసిన న‌టుడు ఆయుష్మాన్‌. ఆ సినిమా తెలుగులోనూ విడుద‌లైంది. ఫేమ్ ఉన్న ఏ న‌టుడు కూడా చేయ‌డానికి సాహ‌సించ‌ని స‌బ్జెక్ట్ విక్కీ డోన‌ర్‌. అయినా చేసి, త‌న ప్ర‌త్యేక‌త‌ను నిరూపించుకున్నారు. రీసెంట్‌గా ఆయుష్మాన్ ఖురానా న‌టించిన డాక్ట‌ర్ జీ కూడా ఆడియ‌న్స్ లో మంచి స్పంద‌న తెచ్చుకుంది. అబ్బాయి గైన‌కాల‌జీ చ‌ద‌వాల్సి వ‌స్తే ప‌రిస్థితి ఏంటి? చుట్టూ అంద‌రూ అమ్మాయిలే ఉన్న క‌ళాశాల‌లో గైన‌కాల‌జిస్ట్ గా అబ్బాయి ఎలా చ‌దువుకున్నాడు? వారి మ‌ధ్య ఎలా నిల‌దొక్కుకున్నాడు అనే విష‌యాల‌తో స‌ర‌దాగా సాగిన సినిమా డాక్ట‌ర్ జి. సినిమా స‌ర‌దాగా సాగిన‌ప్ప‌టికీ, ఆలోచింప‌జేసే విష‌యాల‌ను అందులో పొందుప‌ర‌చారు మేక‌ర్స్.