Read more!

English | Telugu

మూడు వారాలు జైల్లో గ‌డిపాక ఆర్య‌న్ ఖాన్‌కు బెయిల్ వ‌చ్చేసింది!

 

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌, గౌరీ ఖాన్ దంప‌తుల పెద్ద‌కొడుకు ఆర్య‌న్ ఖాన్‌కు గురువారం బెయిల్ మంజూర‌య్యింది. క్రూయిజ్ షిప్ డ్ర‌గ్ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసిన త‌ర్వాత ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలులో దాదాపు మూడు వారాలు గ‌డిపాక అత‌నికి ఊర‌ట ల‌భించింది. ఆర్య‌న్ ఖాన్ త‌ర‌పున వాదిస్తున్న మాజీ అటార్నీ జ‌న‌ర‌ల్ ముకుల్ రోహ‌త్గి గురువారం బాంబే హైకోర్టుకు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వ‌చ్చారు. జ‌స్టిస్‌ నితిన్ సాంబ్రే విచార‌ణ జ‌రిపి త‌న తీర్పును వెలువ‌రించారు.

ఆర్య‌న్ ఖాన్‌తో పాటు అత‌ని క్లోజ్ ఫ్రెండ్ అర్బాజ్ మ‌ర్చంట్‌, మోడ‌ల్ మున్‌మున్ ధ‌మేచాల‌కు కూడా బెయిల్ మంజూర‌య్యింది. ఎందుకు బెయిల్ ల‌భించింద‌నే కార‌ణాలు, బెయిల్ కండిష‌న్ల‌తో శుక్ర‌వారం బెయిల్ ఆర్డ‌ర్ రిలీజ‌వుతుంది. అంటే జైలు నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి ఆర్య‌న్‌ రేప‌టి దాకా వేచి వుండాల్సిందే. 

ఆర్య‌న్ కోసం రెండు రోజుల పాటు రోహ‌త్గి వాదించ‌గా, ఎన్సీబీ త‌ర‌పున అడిష‌న‌ల్ సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ అనిల్ సింగ్‌, అడ్వ‌కేట్ శ్రీ‌రామ్ శిర్సాత్‌, స్పెష‌ల్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ అద్వైత్ సేత్న వాదన‌లు వినిపించారు.

అక్టోబ‌ర్ 3న ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అక్టోబ‌ర్ 8న ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలుకు అత‌డిని త‌ర‌లించారు. అప్ప‌ట్నుంచీ ఆ జైలులోనే ఊచ‌లు లెక్క‌బెడుతూ వ‌చ్చాడు ఆర్య‌న్‌.