Read more!

English | Telugu

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. బ‌రిలోకి దిగుతున్న స‌ల్మాన్!

మొన్న అన్న‌య్య‌తో 'గాడ్‌ఫాద‌ర్' చేశారు, ఇప్పుడు త‌మ్ముడితో సినిమా చేయ‌డానికి సల్మాన్ ఒప్పుకున్నారా? అని ఆలోచిస్తున్న‌ట్టున్నారు.. మీ ఆలోచ‌న అదే అయితే, విష‌యం మాత్రం అది కాదు. అర్బాజ్ ఖాన్‌తో 'ద‌బాంగ్ 4' చేయ‌డానికి స‌ల్మాన్‌ఖాన్ రెడీ అవుతున్నార‌ట‌. అత్యంత గొప్ప ప్రేమ‌, కృషితో ఫోర్త్ పార్ట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నామ‌ని అర్బాజ్ ఖాన్ ప్ర‌క‌టించారు. ఆయ‌న తెర‌కెక్కించిన ‘త‌నావ్’ వెబ్‌సీరీస్ ఈ నెల 11న విడుద‌ల కానుంది. ఈసంద‌ర్భంగా స‌ల్మాన్ సినిమా గురించి మాట్లాడారు అర్బాజ్‌. 'ద‌బాంగ్' సీరీస్‌కి నార్త్ లో స‌ల్మాన్‌కి ఎంత పేరు వ‌చ్చిందో, మ‌న ద‌గ్గ‌ర ప‌వ‌న్ క‌ల్యాణ్ కి కూడా అంతే క్రేజ్ వ‌చ్చింది.  

చుల్‌బుల్ పాండేగా స‌ల్మాన్‌ని ప్రేక్ష‌కులు అమితంగా ఆరాధించిన ఫ్రాంఛైజీ 'ద‌బాంగ్‌'. ఫ‌స్ట్, సెకండ్ పార్టుల‌కు విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. థ‌ర్డ్ పార్ట్ పెద్ద‌గా జ‌నాల‌కు న‌చ్చ‌క‌పోయినా, 'ద‌బాంగ్ సీరీస్' అన‌గానే ఒక‌ర‌క‌మైన ఎన‌ర్జీ మాత్రం క‌నిపిస్తోంది ఆడియ‌న్స్ లో. మూడో పార్టు తీయ‌డానికి చేసినంత ఆల‌స్యం, నాలుగో పార్టు విష‌యంలో జ‌ర‌గ‌ద‌న్న‌ది అర్బాజ్ మాట‌. తాను, స‌ల్మాన్ ఫోర్త్ పార్టు కోసం శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నామ‌ని అంటున్నారు డైర‌క్ట‌ర్‌. 

ఆయ‌న మాట్లాడుతూ, "ప్ర‌స్తుతం, నేను, సల్మాన్ మా క‌మిట్‌మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నాం. ఫ‌లానా తేదీన మొద‌లు పెడ‌తాం అని చెప్ప‌లేను కానీ, క‌చ్చితంగా సినిమా చేస్తాం. మూడో పార్టుకు చేసినంత ఆల‌స్యం మాత్రం చేయం. గ‌త చిత్రాల‌తో పోలిస్తే, త‌ప్ప‌కుండా చాలా చాలా కొత్త కంటెంట్‌ని నెక్స్ట్ సినిమాలో ఇస్తాం" అని అన్నారు. షారుఖ్ న‌టించిన 'ప‌ఠాన్‌'లో గెస్ట్ రోల్ చేస్తున్నారు స‌ల్మాన్‌. 'టైగ‌ర్ 3' సెట్స్ మీద ఉంది. అది కాకుండా 'కిసీ కా భాయ్‌, కిసీ కీ జాన్' సినిమా కూడా ప్రొడ‌క్ష‌న్‌లో ఉంది.