Read more!

English | Telugu

ఆలియా, ర‌ణ‌బీర్ పెళ్లి ఈనెల 15నే.. 17న కాదు!

 

బాలీవుడ్ బిగ్గెస్ట్ వెడ్డింగ్‌గా అంద‌రూ పేర్కొంటున్న ఆలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ పెళ్లి గురించిన వార్త‌లు రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త క‌థ‌లు కూడా దానిపై పుట్టుకొస్తున్నాయి. ఆలియా, ర‌ణ‌బీర్ ఏప్రిల్ 17న కాకుండా మ‌రో రోజు పెళ్లాడ‌నున్నారంటూ ఈ రోజు మీడియాలో రిపోర్టులు వ‌చ్చాయి. ఒక రిపోర్ట్ ప్ర‌కారం ఆ ఇద్ద‌రూ ఏప్రిల్ 15 రాత్రి 2 నుంచి 4 గంట‌ల మ‌ధ్య‌లో (తెల్ల‌వారితే ఏప్రిల్ 16) పెళ్లిపీట‌లెక్క‌నున్నారు. పంజాబీ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వారి వివాహం జ‌ర‌గ‌నుంది. వారి పెళ్లి ప‌నులు ఏప్రిల్ 13న మెహందీ వేడుక‌తో ప్రారంభం కానున్నాయి.

అయితే త‌మ పెళ్లి వార్త‌ల‌పై ఆలియా, ర‌ణ‌బీర్ ఇద్ద‌రూ పెద‌వి విప్ప‌లేదు. అయితే వారి స‌న్నిహిత వ‌ర్గాలు ఏప్రిల్ 13న మెహందీ ఫంక్ష‌న్‌, ఏప్రిల్ 14న సంగీత్ వేడుక‌, ఏప్రిల్ 15 రాత్రి, 16 తెల్ల‌వారుజామున పెళ్లి వేడుక ఉంటాయ‌ని తెలిపాయి. పెళ్లికి సంబంధించిన ప్ర‌తి వేడుకా చెంబూరులోని ఆర్‌.కె. హౌస్‌లోనే జ‌ర‌గ‌నుంది.

ఆలియా, ర‌ణ‌బీర్ తొలిసారి జంట‌గా 'బ్ర‌హ్మాస్త్ర' సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్‌పైనే వారు ప్రేమ‌లో ప‌డ్డారు. నిజానికి 2018లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. అయ‌న్ ముఖ‌ర్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున‌, మౌనీ రాయ్‌, డింపుల్ క‌పాడియా కూడా కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 9 'బ్ర‌హ్మాస్త్ర' విడుద‌ల‌వుతోంది.