English | Telugu

కొవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.. మాల్దీవుల‌కు చెక్కేశారు!

అలియా భ‌ట్‌, రణ‌బీర్ క‌పూర్ మాల్దీవుల‌కు చెక్కేశారు. విప‌రీతంగా పెరుగుతున్న కొవిడ్‌-19 కేసుల‌కు అడ్డుక‌ట్ట వేసే ల‌క్ష్యంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ముంబైలో 15 రోజుల జ‌న‌తా క‌ర్ఫ్యూను విధించింది. దీంతో సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. అలియా, ర‌ణ‌బీర్ ఇద్ద‌రూ కొద్ది రోజుల క్రితం కొవిడ్ పాజిటివ్‌గా టెస్టుల్లో నిర్ధార‌ణ అయ్యి, కోలుకున్నారు. ఇద్ద‌రికీ నెగ‌టివ్ రావ‌డం, షూటింగ్‌లు కేన్సిల్ కావ‌డంతో ఈ సెల‌వుల్ని ఎంజాయ్ చేసే ఉద్దేశంతో మాల్దీవుల‌కు వెళ్లారు. సోమ‌వారం మార్నింగ్ వారు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇద్ద‌రూ వైట్ మ్యాచింగ్ డ్ర‌స్సులు ధ‌రించారు. ముఖాల‌కు బ్లాక్ మాస్కులు ధ‌రించారు. వాళ్ల‌కంటే ముందు, సారా అలీఖాన్‌, టైగ‌ర్ ష్రాఫ్‌, దిశా ప‌టాని వెకేష‌న్ నిమిత్తం మాల్దీవుల‌కు వెళ్లారు.

కొవిడ్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి సుర‌క్షిత‌మైన టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్తున్నారు ప‌లువురు సెల‌బ్రిటీలు. అదే త‌ర‌హాలో అలియా భ‌ట్‌, ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా ఫ్రీ టైమ్ ల‌భించ‌డంతో, కొంత టైమ్‌ను క‌లిసి గ‌డిపేందుకు మాల్దీవుల‌కు వెళ్లాల‌ని డిసైడ్ చేసుకున్నారు. కొవిడ్ నుంచి ర‌ణ‌బీర్ క‌పూర్ కోలుకున్న త‌ర్వాత‌, ఏప్రిల్ 2న అలియాకు పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. హోమ్ క్వారంటైన్‌లో ఉన్న ఆమెకు ఏప్రిల్ 14న నెగ‌టివ్‌గా తేలింది.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ మూవీ 'గంగుబాయ్ క‌థియ‌వాడి'లో అలియా భ‌ట్ క‌నిపించ‌నున్న‌ది. షెడ్యూల్ ప్ర‌కారం ఆ మూవీ జూలై 30న రిలీజ్ కావాలి. అలాగే రాజ‌మౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్‌', అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ‌బీర్ క‌పూర్‌, నాగార్జున‌తో న‌టిస్తోన్న 'బ్ర‌హ్మాస్త్ర‌', హోమ్ ప్రొడ‌క్ష‌న్ మూవీ 'డార్లింగ్స్‌', క‌ర‌ణ్ జోహార్ సినిమా 'త‌ఖ్త్' ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా రానున్నాయి.

మ‌రోవైపు 'బ్ర‌హ్మాస్త్ర‌'తో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తోన్న 'యానిమ‌ల్‌', శ్ర‌ద్ధా క‌పూర్‌తో చేస్తోన్న టైటిల్ ఖ‌రారు కాని సినిమాల‌ను ర‌ణ‌బీర్ క‌పూర్ చేస్తున్నాడు.