English | Telugu
ఒకప్పుడు ప్రముఖ నటుడు.. ఇప్పుడు వాచ్ మ్యాన్ గా చిన్న ఉద్యోగం!
Updated : Jul 22, 2025
జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియదు. సినిమా వాళ్ళ జీవితం అయితే మరీను. అప్పటిదాకా స్టార్ గా వెలుగొందిన వాళ్ళు.. ఒక్కసారిగా కనుమరుగైపోతారు. సినిమాల్లోనే కాదు.. సినిమా వాళ్ళ జీవితాల్లోనూ ఎన్నో మలుపులు ఉంటాయి. ఒకప్పుడు ఎన్నో బడా సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఓ ప్రముఖ నటుడు.. ఇప్పుడు వాచ్ మ్యాన్ గా మారాడు. ఆ నటుడు ఎవరో కాదు.. సావి సిద్ధు. (Savi Sidhu)
ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన సావి సిద్ధు.. 1995 లో వచ్చిన 'తాకత్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి 2014 వరకు బాలీవుడ్ లో పలు సినిమాలు చేశారు. 'బ్లాక్ ఫ్రైడే', 'గులాల్', 'పాటియాలా హౌస్', 'బేవకూఫియాన్' వంటి సినిమాలతో ఆయన సత్తా చాటారు. ముఖ్యంగా 'బ్లాక్ ఫ్రైడే'లో సావి సిద్ధు పోషించిన కమిషనర్ ఎ.ఎస్. సమ్రా పాత్ర ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆరడుగులకు పైగా ఎత్తుండే సావి సిద్ధు.. విభిన్న పాత్రలతో బాలీవుడ్ లో తన మార్క్ చూపించారు. కోలీవుడ్ లోనూ 'ఆరంభం' అనే సినిమా చేశారు. దాదాపు రెండు దశాబ్దాలు సాగిన సినీ ప్రయాణంలో.. అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, అజిత్ కుమార్ వంటి ఎందరో స్టార్ల సినిమాల్లో భాగమయ్యారు.
మంచి రూపం ఉండి, ప్రతిభ ఉండి, సినిమాలు చేయగల సత్తా ఉండి కూడా.. సావి సిద్ధు కొన్నేళ్లుగా ముంబైలో వాచ్ మ్యాన్ గా పని చేస్తున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి ఒంటరి వాడిని అయ్యానని.. మానసిక ఒత్తిడి, ఆర్ధిక సమస్యలతో కృంగిపోయానని.. అందుకే వాచ్ మ్యాన్ గా పని చేస్తున్నానని ఆమధ్య మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు సావి సిద్ధు.
2014లో విడుదలైన 'బేవకూఫియాన్' తర్వాత సావి సిద్ధు పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కొన్నేళ్లుగా వాచ్ మ్యాన్ గా పని చేస్తున్న ఆయన.. చివరిగా 2020లో వచ్చిన 'మస్కా' అనే ఓటీటీ ఫిల్మ్ లో కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయనకు అవకాశాలు లేవు. సావి సిద్ధు లాంటి నటుడికి సినీ పరిశ్రమ అండగా నిలిచి, ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని నెటిజెన్లు కోరుతున్నారు.