English | Telugu
భారతీయులంతా 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా చూడాలి
Updated : Mar 21, 2022
1990లలో కశ్మీర్ లో పండిట్లపై జరిగిన దాడుల నేపథ్యంలో తెరకెక్కిన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 11 న విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. పది రోజుల్లో దాదాపు రూ.170 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ మూవీ 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ప్రధాని మోడీ సైతం ఈ సినిమాని ప్రశంసించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ సైతం భారతీయులంతా ఈ సినిమా చూడాలని పిలుపునివ్వడం విశేషం.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఢిల్లీలో ఈవెంట్ నిర్వహించగా.. దానికి ఆమిర్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తారక్, చరణ్ తో కలిసి 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసి అలరించిన ఆమిర్.. అనంతరం మూవీ టీమ్ కి విషెస్ తెలిపాడు.
ఆర్ఆర్ఆర్ ఈవెంట్ సందర్భంగా ఏర్పడు చేసిన మీడియా సమావేశంలో 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా చూశారా? మీడియా వారు అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆమిర్.. వర్క్ బిజీలో ఉండి తాను ఇంకా సినిమా చూడలేదని, కానీ తప్పకుండా చూస్తానని అన్నాడు. అలాగే "అప్పట్లో కశ్మీర్ పండిట్ల విషయంలో జరిగింది నిజంగా విచారకరం. ఇలాంటి సినిమాలను ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా భావోద్వేగానికి గురిచేసింది. ఈ సినిమా సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది" అని ఆమిర్ అన్నాడు.