English | Telugu
హైదరాబాద్‌లో ఖిలాడిని కలుసుకున్న టొవినో!
Updated : Oct 11, 2023
హైదరాబాద్ వేదికగా పొరుగు హీరోలు కలుసుకోవడం, కలిసి తీసుకున్న ఫొటోలు షేర్ చేయడం... ఇలాంటి వాటిని చూసినప్పుడే కదా, హైదరాబాద్ క్రేజ్ ముంబైని దాటిపోయిందని అర్థమయ్యేది. మన దగ్గరకు సినిమా వాళ్లు ఎంత ఇష్టంగా వస్తున్నారో అర్థమయ్యేది. హైదరాబాద్‌లో ఉన్నారు ఖిలాడి అక్షయ్‌కుమార్. మలయాళ హీరో టొవినో థామస్ కూడా ఇక్కడే ఉన్నారు. వీరిద్దరూ జిమ్‌లో కలుసుకున్నారు. ఈ విషయాన్ని టొవినో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్‌ని కలుసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు టొవినో. నాకు ఖేల్ తెలుసు. నేనిప్పుడు రియల్ ఖిలాడీని కలుసుకున్నాను అని ఆయన పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
వీరిద్దరూ అసలు హైదరాబాద్‌లో ఎందుకు కలుసుకున్నారనే విషయం మీద నెటిజన్లకు ఇంట్రస్ట్ పెరిగింది. మిన్నల్ మురళీ, ఖిలాడీ కలుసుకున్నారు. మిన్నల్ మురళిని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మిన్నల్ మురళిని హిందీలో అక్షయ్ రీమేక్ చేస్తారు అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
అక్షయ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో సింగం అగైన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ కోసమే ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. అజయ్ దేవ్‌గన్, కరీనా కపూర్, రణ్‌వీర్ సింగ్ కూడా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు. టొవినో ప్రస్తుతం ఎల్2 షూటింగ్ ప్రిపరేషన్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు. మలయాళ సూపర్‌హిట్ సినిమా లూసిఫర్‌కి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది ఎల్2. ఈ సినిమాతో పాటు అన్వేషిప్పిన్ కండతుమ్, అదృశ్య జలకంగళ్ సినిమాలు కూడా టొవినో చేతిలో ఉన్నాయి.