English | Telugu
రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో అనుపమ్!
Updated : Jul 9, 2023
గీతాంజలి సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రలో చేయడానికి యస్ చెప్పారు ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్. రవీంద్రుడి గెటప్ అనుపమ్‌కి పక్కాగా సూట్ అయింది. ఆ గెటప్‌లో ఆయన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆయన నటిస్తున్న 538వ ప్రాజెక్ట్ ఇది. ఈ లుక్‌ని షేర్ చేశారు అనుపమ్.
నోబల్ అవార్డు గ్రహీత జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. కవి, విద్యావేత్త, తాత్వికుడు అయిన రవీంద్రనాథ్ ఠాగూర్‌గా నటించడం ఆనందంగా ఉందని అన్నారు అనుపమ్. గురుదేవ్‌గా కనిపించడం పూర్వజన్మసుకృతమని చెప్పారు. ఈ అవకాశం దక్కడం గర్వంగా ఉందని అన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను పంచుకుంటానని తెలిపారు. బ్లాక్ అండ్ వైట్లో పొడవాటి తెల్లటి గడ్డం పెంచి, రవీంద్రుడిలాగానే కనిపిస్తున్నారు అనుపమ్. మేకప్ వేసిన వాళ్లు సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు జనాలు.
అనుపమ్ ఖేర్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. కంగనా రనౌత్ దర్శకత్వంలో ఎమర్జెన్సీలో నటిస్తున్నారు. ఫార్మర్ ఇండియన్ పొలిటిషియన్ జయప్రకాష్ నారాయణ్‌గా కనిపిస్తారని టాక్. ఈ సినిమా నవంబర్ 24న థియేటర్లలోకి రానుంది. దీంతో పాటు అనురాగ్ బసు యాంథాలజీ మెట్రో ఇన్ డినోలోనూ నటిస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, కొంకనా సేన్ శర్మ, పంజ్ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్, అలీ ఫజల్, నీనా గుప్తా కీ రోల్స్ చేస్తున్నారు.
అటు కశ్మీర్ ఫైల్స్ డైరక్టర్ వివేక్ అగ్నిహోత్రితోనూ ఓ మూవీ చేస్తున్నారు అనుపమ్ ఖేర్. ది వ్యాక్సిన్ వార్‌లో ఆయన రోల్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని టాక్. కోవిడ్ 19 వ్యాక్సిన్ సమయంలో జరిగిన అంశాల ఆధారంగా తెరకెక్కుతోంది ఈ సినిమా.