English | Telugu

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ చేతిలో నాలుగు సినిమాలు!

ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ ఇప్పుడు స్టూడియో మోడ‌ల్‌లో వ‌ర్క్ చేస్తోంది. ఒక‌టికి నాలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నారు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్. ల‌పాటా లేడీస్‌, ప్రీత‌మ్ ప్యారే, చాంపియ‌న్స్ రీమేక్‌, జ‌య జ‌య జ‌య జ‌య‌హే రీమేక్ ఆయ‌న అండ‌ర్‌లోనే జ‌రుగుతున్నాయి. ఫ్యామిలీకి కాస్త స‌మ‌యం కేటాయించాలి. నిర్మాత‌గా స్ట్రాంగ్‌గా నిల‌బ‌డాలి. అందుకే నేను కెరీర్‌కి బ్రేక్ తీసుకుంటున్నా అని గ‌త అక్టోబ‌ర్‌లో ఆమీర్‌ఖాన్ ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప‌లు సెల‌బ్రేష‌న్స్ చేస్తూనే ఉన్నారు. ఆయ‌న యాక్టింగ్ కెరీర్ గురించి మాత్రం ఎలాంటి కాంక్రీట్ అప్ డేట్ ఇవ్వ‌లేదు. అయితే ఇటీవ‌ల ఆమీర్‌ని ఫ‌ర్హాన్ అక్త‌ర్ క‌లిశారు. స్పానిష్ సినిమా చాంపియన్స్ కోసం ఫ‌ర్హాన్‌ని ఆమీర్ అప్రోచ్ అయ్యార‌న్న‌ది టాక్‌. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో సెట్స్ మీద‌కు వెళ్తుంది. ఆర్ ఎస్ ప్ర‌స‌న్న ఈ సినిమాకు డైర‌క్ట్ చేస్తారు.

అతి త్వ‌ర‌లోనే జ‌య జ‌య జ‌య జ‌య‌హే సినిమాను సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌డానికి ఆమీర్‌ఖాన్ సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌ల‌యాళం సినిమా ఇది. సీమా ప‌హ్వా హిందీలో డైర‌క్ట్ చేస్తారు. ప్ర‌స్తుతం హిందీకి త‌గ్గ‌ట్టు స్క్రిప్ట్ చేంజెస్ జ‌రుగుతున్నాయి. ఒరిజిన‌ల్ సినిమా చేసిన ద‌ర్శ‌న రాజేంద్ర‌న్ ఇక్క‌డ కూడా న‌టిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆమీర్‌, ఆర్ ఎస్ ప్ర‌స‌న్న క‌లిసి నిర్మించ‌నున్నారు. ఆమీర్ ప్రొడ‌క్ష‌న్‌లో మ‌రో రెండు సినిమాలు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఉన్నాయి. సునీల్ పాండే డైర‌క్ష‌న్‌లో ప్రీత‌మ్ ప్యారే తెర‌కెక్కుతోంది. సంజ‌య్ మిశ్రా, ఆమీర్‌ఖాన్ ఇందులో కేమియో అప్పియ‌రెన్స్ ఇస్తార‌ట‌. మ‌రోవైపు కిర‌ణ్ రావు ద‌ర్శ‌క‌త్వంలో ల‌పాటా లేడీస్ తెర‌కెక్కుతోంది. రెండూ ఎడిటింగ్‌లో ఉన్నాయి. ఆమీర్ ద‌గ్గ‌రుండి ఎడిటింగ్ చేయిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఈ రెండు సినిమాలు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతాయ‌న్న‌ది ముంబై మాట‌.