Facebook Twitter
నేటి తల్లి

 

నేటి తల్లి

అమ్మ లేనిది సృష్టి అనేది లేదు,
 అమ్మ మనసు బిడ్డకి చిన్న దెబ్బ తగిలినా, జబ్బు చేసినా, కలత చెందినా
 అమ్మ మనసు గిలగిల లాడుతుంది,
 బిడ్డ మాములుగా  అయ్యేదాక కంటి మీద కునుకు
 లేకుండా కాపాడుతుంది అమ్మ.
 తనకి జబ్బు చేసినా తన బిడ్డలను దృష్టిలో పెట్టుకొని ఆ జబ్బుతో,
 మృత్యువుతో  పోరాడి వారు జీవితంలో స్థిర పడేదాక
 కనిపెట్టుకొని వుంటుంది అమ్మ.
 తను వంటింట్లో వుండి తన బిడ్డలు పెద్ద చదువులు చదివి
 వుద్యోగ నిమ్మిత్తం  దేశ విదేశాలకి  తనని వదలి పోతుంటే
 తను మాత్రం ఆ యింటి కిటికీలో నుండి చూస్తూ ఆనందభాష్పాలు
 రాలుస్తూ నా బిడ్డలు అభివృద్దిలోకి వచ్చారని
 మురిసిపోతుంది అమ్మ.
 వృద్దాప్యంలో ఒక్కతే వుండాల్సి వచ్చినా పిల్లలు వాళ్ళ సంసారాల్తో,
 వుద్యోగాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు నేనేమి వాళ్ళను ఇబ్బంది పెట్టను
 అనుకుంటుంది అమ్మ.
 ఏనాడు ఒక్కతి వూరు వదలి వెళ్ళకున్నా విదేశాల్లో వున్న కోడలికో,
 కూతురికో పురుడు పోయటానికి,
కూతురు వుద్యోగానికి వెళ్ళితే చంటి పిల్లల్ని
 చూసుకోవడానికి విమాన  ప్రయాణం చేసి భాష రాకున్నా బిడ్డల
 అవసరానికి  అక్కరకు రాకపోతే ఎలా? అనుకుంటూ వెళ్ళి
 వారికి అన్ని సేవలు చేస్తుంది అమ్మ.
 పిల్లలు సంతోషంగా వూళ్ళు చూపిస్తే వెనక్కి తిరిగి వచ్చి అందరికి
 ఆనందంగా చెప్పుకుంటుంది అల్ప సంతోషి అమ్మ.
 ఒంటరితనం బాధిస్తున్నా, వృద్దాప్యంలో వచ్చే జబ్బులు పీడిస్తున్నా,
 అత్మాభిమానంతో అలాగే బ్రతుకీడుస్తున్నది అమ్మ.
 ఒకే వూళ్ళో వున్నా వుద్యోగాలకి వెళ్ళి రావడానికి చాలా సమయం
 పడుతున్నది అందుకే అక్కడికి దగ్గరలో ఇల్లు తీసుకొని వుంటాము
 అప్పుడప్పుడు వచ్చి చూస్తాము అని పిల్లలు అన్నా కూడా మౌనంగా
 వుండిపోతుంది అమ్మ.
 కొంతమంది తల్లి వృద్దాప్యంలో జబ్బు చేసి ఎందుకూ పనికి
 రాకుండా పోయిందని తీసికెళ్ళి రోడ్డు పై వదిలేసి వెళ్ళితే,
 ఏం చేయాలో తోచక జీవిత చరమాంకంలో రోడ్డు
 పై గడపాల్సి వచ్చినందుకు కుమిలిపోతూ,
 తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక,
 కన్న బిడ్డలే ముసలితనంలో పనికిరాని నువ్వు మాకు
 వొద్దు అని వదిలేసి వెళితే ఆ అవమానం తట్టుకోలేక
 ఒడ్డున పడ్డ చేపలాగ కొట్టుకుంటుంది అమ్మ,
 ఇలాంటి వృద్దుల కోసం ఆశ్రమాలు పెట్టిన వారితో
 వెళ్ళినా తమ బ్రతుకులు ఎందుకు ఇలా అయ్యాయో తెలియక
 అయోమయోంలో వున్న వారితో కలిసి వుంటున్నది అమ్మ,
 బిడ్డలకు దెబ్బ తగిలితే తల్లడిల్లిపోయిన తల్లికి మానసికంగా,
 శారీరకంగా గాయపడినా,
 కన్న బిడ్డల ఆత్మీయమైన చూపు కోసం,
 వారి మమత కోసం ఎదురుచూస్తూనే కాలం
 గడుపుతున్నది అమ్మ.
 నా బిడ్డలు ఎదిగేపుడు ఎంతో సంతోషించాను,
 వారు ఆనందంగా వుంటే చాలనుకున్నాను,
 తన అవసరం ఎవరికి వుందో వారికి సాయం చేసుకుంటూ,
ఏదో పోగొట్టుకున్నట్టుగా కాక తన ప్రేమని
ఎంతోమందికి పంచుతూ, ధైర్యంగా,
స్వతంత్రంగా బ్రతుకుతున్నది నేటి తల్లి.

-కనకదుర్గ