TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పిచ్చుక కోపం
అనగనగా ఒక ఊళ్లో ఒక పిచ్చుక, ఒక కాకి ఉండేవి.
అవి రెండూ ఒకసారి ఒక తోటకు వెళ్ళాయి. అక్కడ పిచ్చుకకు ఒక వరి గింజ దొరికింది. వెంటనే అది దాన్ని నోట్లో వేసుకుంది. కాకి కూడా అక్కడే ఆహారం కోసం వెదుకుతూ ఉంటే, దానికొక నాణెం కనబడింది. ఆ నాణాన్ని చూడగానే కాకికి వింత సంతోషం కలిగింది.
అది ఆ నాణాన్ని తీసుకొని ఒక పెద్ద చెట్టు కొమ్మమీద ఆడుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన పిచ్చుక, తను కూడా అలా నాణెంతో ఆడుకోవాలనుకుంది. అందుకని అది కాకి దగ్గరకు వెళ్ళి ’నాణాన్ని నాకివ్వవా’ అని అడిగింది.
అప్పుడు కాకి "ఈ నాణెం నాది. నేను దీన్ని నీకివ్వను" అని చెప్పింది.
పిచ్చుక మరోసారి అడిగింది. కానీ కాకి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది.
పిచ్చుకకు కోపం ముంచుకొచ్చింది. "ఉండు నీ పని చెబుతా, నీ పని!" అని అది కాకి కూర్చున్న చెట్టుతో అన్నది, "చెట్టూ, చెట్టూ! ఆ కాకిని వెంటనే నీ మీదనుండి తరిమెయ్యి" అని.
"ఊహూ! నేను తరమను. ఈ కాకి నాకేమీ హాని చెయ్యలేదు. సరైన కారణం లేకుండా ఊరికే నేనెవ్వరికీ ఇబ్బంది కలిగించను" అన్నది చెట్టు.
చెట్టు మాటలు పిచ్చుకకు ఇంకా కోపం తెప్పించాయి. "సరే ఆగు. నీ పనీ పడతాను" అని అక్కడి నుండి చెట్లు కొట్టే ఒక మనిషి దగ్గరకు వెళ్ళింది పిచ్చుక. ఇక అక్కడ అతనితో చెప్పింది "ఓ మనిషీ! నువ్వా చెట్టును నరికి పారెసెయ్యి" అని.
అందుకు ఆ మనిషి "నాకిప్పుడు వేరే పనుంది. నేను ఆ చెట్టును కొట్టలేను ఫో" అన్నాడు.
"సరే. ఇక నేనిప్పుడు నీ సంగతేంటో చూస్తాను మొదట" అంటూ పిచ్చుక అక్కడి నుండి గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళింది.
పిచ్చుక గ్రామ పెద్దతో, "ఓ పెద్దాయన గారూ! మీరా చెట్లు కొట్టే వాణ్ణి శిక్షించండి" అన్నది.
అప్పుడా గ్రామ పెద్ద "ఊరికే తన పని తను చేసుకుంటున్న వాణ్ణి నేనెందుకు శిక్షిస్తాను? లేదు, లేదు. నేను ఆ పనిని చెయ్యలేను!" అన్నాడు.
అప్పుడా పిచ్చుక "సరే. అయితే నేనింక రాజు దగ్గరికి పోయి చెప్తా, మీ అందరి పనీ" అంటూ రాజు దగ్గరికి ఎగిరివెళ్లింది.
పిచ్చుక వెళ్ళి, రాజుతో "ఓ రాజా! మీరు గ్రామ పెద్దను దండించండి, దయచేసి" అని అడిగింది మర్యాదగా.
అందుకు రాజు "నిరపరాధులను శిక్షించడమా! మేం ఆ పనిని చెయ్యలేము. చెయ్యము కూడా" అని చెప్పేశాడు.
పిచ్చుక అక్కడి నుండి రాణి దగ్గరకు వెళ్ళింది. "ఓ మహారాణీ! మీరు రాజుతో చెప్పండి, ఆ గ్రామ పెద్దను శిక్షించమని" అన్నది.
అందుకు రాణి "ఊహూ! నేను చెప్పను. అవన్నీ రాజుగారే చూసుకుంటారు" అని చెప్పింది.
"అయితే సరే. నేను ఇంకెవరినైనా అడుగుతానుగానీ" అని పిచ్చుక ఒక ఎలుక దగ్గరికి పోయింది. "ఎలుకా, ఎలుకా! నువ్వు నాకోసం రాణిగారి బట్టలను కొరికి పారెయ్యవా!" అని అడిగింది.
ఎలుక అన్నది, "రాణి నన్నేం చెయ్యలేదు కదా! నేనెందుకు రాణిగారి బట్టలను కొరుకుతాను? నేను కొరకను" అని. "సరేలే ఎలుకమ్మా!" అని పిచ్చుక అక్కడి నుండి ఒక పిల్లి దగ్గరకు ఎగిరింది.
"ఓ పిల్లీ! నువ్వు రాణి గారి ఇంట్లోని ఎలుకను తినేసెయ్యి" అని చెప్పింది పిచ్చుక.
పిల్లి అప్పుడే వేరే ఏదో తిని భుక్తాయాసంతో ఉన్నది. "నేను తిననమ్మా, నా కడుపులో చోటు లేదు" అని చెప్పిందది.
అప్పుడు పిచ్చుక కుక్క దగ్గరికి వెళ్ళి అడిగింది "ఓ కుక్కా! నువ్వు ఆ పిల్లిని తినేసెయ్యి" అని. అందుకు ఆ కుక్క "నేనెందుకు తినాలి పిల్లిని? నాకా అవసరమే లేదు" అని చెప్పింది.
అలసిపోయిన పిచ్చుక అక్కడినుండి మూతి తిప్పుకుంటూ ఒక కర్ర దగ్గరకి వెళ్ళింది. కర్రను అడిగింది, "ఓ కర్రా! నువ్వు ఆ కుక్కను బాగా కొట్టవా, దయచేసి?" అని. అందుకు ఆ కర్ర "లేదు, లేదు! నేను ఆ కుక్కను ఊరికే కొట్టలేను" అని చెప్పింది.
పిచ్చుక అక్కడికి దగ్గర్లోనే ఉన్న మంట దగ్గరికి వెళ్ళింది. "మంటా, మంటా! నువ్వు కర్రను కాల్చెయ్యి" అని అడిగింది. మంట అన్నది, "లేదు పిచ్చుకమ్మా, నేను దూరంగా ఉన్న కర్రను ఏమీ చేయలేను" అన్నది.
ఇక పిచ్చుక అక్కడి నుండి నది దగ్గరకు ఎగిరింది. నదితో- "ఓ నదీ! నువ్వు ఆ మంటను ఆర్పేయాలి. నా కోసం నువ్వా పనిని చెయ్యవా?" అని అడిగింది. అందుకు ఆ నది "నేనక్కడికి రాలేనుగానీ, అదిగో- ఆ చెట్టు కింద ఒక ముని కూర్చొని ఉన్నాడు చూడు. కావాలంటే అతని దగ్గరకు వెళ్ళు" అని చెప్పింది.
అక్కడి నుండి పిచ్చుక ఋషి దగ్గరికి ఎగిరి వెళ్ళింది. "ఏం జరిగిందో చెప్పమ"న్నాడు ఋషి. పిచ్చుక రూపాయి నాణెంతో మొదలు పెట్టింది గానీ, చెప్తూ చెప్తూండగానే దానికి ఇక ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన కోపం ఎవరిమీద మొదలై ఎటుపోయిందో చూసి దానికే నవ్వు వచ్చింది. చివరికి అది "నాకు సమాధానం దొరికింది స్వామీ, వెళ్లొస్తాను " అని చెప్పి, తినేందుకు గింజల్ని వెతుక్కుంటూ ఎగిరిపోయింది.