Facebook Twitter
కాకి - కోరిక

కాకి - కోరిక

  డా.ఎ. రవీంద్రబాబు


       
అనగనగా ఒక అందమైన అడవిలో చాలా జంతువులు, పక్షులు కలిసి మెలిసి సంతోషంగా జీవించేవి. ఆ పక్షుల్లో ఒక కాకికి మాత్రం ఓ కోరిక ఉండేది. "నేను అందరికంటే బలంగా ఉండాలి. అందరికంటే గొప్పగా ఉండాలి. అందరూ నన్ను మెచ్చుకోవాలి" అని ఎప్పుడూ అనుకునేది.
       ఒక రోజు కాకికి ఎలాగైనా సరే అందరి కంటే గొప్పదానిగా నిరూపించుకోవాలని ఆ అడవి నుంచి బయట కొచ్చింది. ఎగురుకొంటూ ఎగురు కొంటూ చాలా ప్రదేశాలు తిరిగింది. చాలా అడవులు గాలించింది. కానీ దాని కోరిక తీర్చే వాళ్లెవరూ కనిపించలేదు. చివరకు ఓ భయంకరమైన కొండమీదకు చేరింది. అక్కడున్న ఓ చెట్టుమీద వాలి దిగులుగా కూర్చొంది. విహారానికి వచ్చిన వన దేవతలు దాన్ని చూశారు. "అయ్యో పాపం ఏమైంది?" అని పలకరించారు. కాకి తన బాధంతా వెళ్లబోసుకుంది. "అందరూ తనను అవమానిస్తున్నారని, అందుకని ఎలాగైనా గొప్పదానిగా తిరిగి వెళ్ళాలని" చెప్పింది.
      అందుకు వన దేవతలు నువ్వేమి బాధపడకు. నిన్ను మేము అందంగా, తీయటి గొంతు నీకు వచ్చేలా, నువ్వు ఏది కోరితే అది జరిగేలా వరం ఇస్తాము అని చెప్పి... వరాలిచ్చారు. కానీ "మా గురించి, నీకు ఈ విధంగా వరాలు ఇచ్చిన సంగతి ఎవరకూ చెప్పకు. చెప్తే ఈ శక్తులన్నీ పోయి మళ్లీ మామూలు దానివై పోతావు" అని చెప్పి వెల్లిపోయారు.
      దాంతో కాకి అందమైన పక్షిలా మారిపోయింది. కోకిలకంటే తీయనైన గొంతు వచ్చేసింది. తనను తాను చూసుకొని చాలా సంతోషించింది. తన అరుపు తనే విని పొంగిపోయింది. ఇక తన సొంత అడవిలోకి వెళ్లాలని మనసులో అనుకుంది. అంతే ఎగరకుండానే అక్కడకు వెళ్లిపోయింది.
      దీని రంగు, అరుపు చూసిన మిగిలిన పక్షులు, జంతువులు బిత్తరపోయాయి. నేను మీతో కలిసున్న కాకిని అని చెప్పింది. అయినా అవి నమ్మలేదు. నా శక్తులు చూడండి అని అక్కడో పెద్ద జలపాతాన్ని సృష్టించింది. వాటికి కావాల్సినన్ని ఆహార పదార్థాలు వచ్చేలా చేసింది. జంతువులు పక్షులు ఆ ఆహార పదార్థాలను చక్కగా తిన్నాయి. కానీ "నీకు ఇలాంటి శక్తులు ఎలా వచ్చాయి?" అని అడిగాయి.  "అవన్నీ మీకెందుకు? మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి... నేను ఇప్పుడు మీకు రాజును. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను" అని చెప్పింది. కాకి పెట్టే తిండికోసం అన్ని జంతువులు, పక్షులు సరే అన్నాయి.
    కానీ కొన్ని పక్షులకు, జంతువులకు ఇది నచ్చలేదు. మనకు అది రాజేంటి అనుకున్నాయి. దీని గుట్టు బయటపెట్టాలని అనుకున్నాయి. ఒక రోజు రాత్రి కాకి నిద్ర పోతుంటే దాని గూటిలోకి జొరబడ్డాయి. అంతా వెతికాయి. కానీ ఏమీ దొరకలేదు. కోపంతో నిద్రపోతున్న కాకిని గెట్టిగా పట్టుకొని 
"నీకు ఈ శక్తులు ఎలా వచ్చాయి?. మాకు తెలియాలి?" అన్నాయి. "ఇది రహస్యం చెప్పకూడదు" అని కాకి సమాధానమిచ్చింది.     కోపంతో అవి కాకిని  చంపేశాయి.
   
నీతి: ఉన్న దాంతో తృప్తి పొందాలి, కానీ హటాత్తుగా కలిసి వచ్చే సంపదల వెంట పరుగులు తీయకూడదు. దురాశ దుఃఖానికి చేటు. పరుగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు.