Facebook Twitter
కాకమ్మ - పిచుకమ్మ

కాకమ్మ - పిచుకమ్మ

   - డా. ఎ. రవీంద్రబాబు


    ఒక అడవిలో  పెద్ద చెట్టు మీద కాకమ్మ పిచుకమ్మ ఉండేవి. కాకమ్మ కర్రలతో ఇల్లు కట్టుకుంటే, పిచుకమ్మ పుల్లలతో ఇల్లు కట్టుకొని ఆనందంగా జీవించసాగాయి. కానీ ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది. కాకమ్మ ఇల్లు కర్రలతో ఉండటం వల్ల కూలిపోయింది. పిచుకమ్మ ఇల్లు పుల్లలతో ఉండటం వల్ల గాలికి ఊగిందే కానీ కూలిపోలేదు. అప్పుడు కాకమ్మ పిచుకమ్మ దగ్గరకు వచ్చి... "పిచుకమ్మా... ! పిచుకమ్మా...! నా ఇల్లు కూలిపోయింది. గాలివాన తగ్గేదాక నీ ఇంట్లో ఉంటాను" అని బతిమాలింది. పిచుకమ్మ 'అయ్యో పాపం...!' అని జాలిపడి లోనికి ఆహ్వానించింది.
     కానీ కాకమ్మ గాలివాన తగ్గటంతోనే పిచుకమ్మను తన్ని ఇంట్లో నుంచి తరిమేసింది. పిచుకమ్మ చిన్నది కదా...! ఏమీ చేయలేక ఏడుస్తూ బయటకొచ్చింది. అడవి బయటున్న ఏటి గట్టున కూర్చొని బాధపడసాగింది. ఆ దారి వెంట వెళ్తున్న గాజులమ్మే శెట్టి చూసి... "పిచుకమ్మా...! పిచుకమ్మా...! ఎందుకు దిగులుగా ఉన్నావు.?" అని అడిగాడు. అప్పుడు పిచుకమ్మ జరిగిందంతా చెప్పింది. పిచుకమ్మ దయాగుణాన్ని మెచ్చుకున్న గాజులశెట్టి "పిచుకమ్మ బాధపడకు. చెట్టెక్కిచూడు చెండ్రాకోలు దొరుకుతుంది. గట్టెక్కిచూడు కాడెద్దులు దొరుకుతాయి. వాటితో ఈ పక్కనున్న పొలం దున్నుకొని హాయిుగా జీవించు" అని చెప్పి వెళ్లిపోయాడు.
     అట్లానే పిచ్చుక చెట్టెక్కి చూసింది చెండ్రాకోలు దొరికింది. గట్టెక్కి చూసింది. కాడెద్దులు దొరికాయి. వాటితో పొల దున్నుకొని వ్యవసాయం చేస్తూ... సంతోషంగా బతకసాగింది. ఆ దారివెంట వచ్చే వారికి తిండిపెడ్తూ ఆనందాన్ని పొందసాగింది.
     ఒకరోజు కాకి అటుగా వచ్చింది. పిచ్చుక సౌభాగ్యాన్ని చూసి ఈర్ష్య చెందింది. "నేను నిన్ను ఇంట్లో నుంచి తన్ని తరిమేశాను కదా...! ఇదంతా ఎలా వచ్చింది?" అని అడిగింది. అప్పుడు పిచ్చుకమ్మ జరిగిందంతా చెప్పింది.
     అంతా విన్నాక, కాకి కూడా ఏటి ఒడ్డుకు వెళ్లి దిగులుగా కూర్చొంది. మళ్లీ అటుగా వచ్చిన గాజులశెట్టి కాకమ్మని చూసి "ఏంటి కాకమ్మా బాధపడుతున్నావు?" అని అడిగాడు.  "నా ఇల్లు కూలి పోయింది" అని కాకమ్మ అబద్ధం చెప్పింది. గాజులశెట్టి పిచుకమ్మకు చెప్పినట్లుగానే "చెట్టెక్కి చూడు, చెండ్రాకోలు దొరుకుతుంది. గట్టెక్కి చూడు, కాడెద్దులు దొరుకుతాయి. వాటితో నువ్వూ మరికొంత పొలాన్ని దున్నుకొని బతుకు." అని చెప్పి వెళ్లిపోయాడు.
     గాజులశెట్టి చెప్పినట్లుగానే కాకి చెట్టెక్కి చూసింది. చెయ్యి విరిగింది. గట్టెక్కి చూసింది. కాలు విరిగింది. చేసేది ఏమీ లేక కుర్రోమర్రో అంటూ బాధపడసాగింది.
  నీతి- ఉపకారికి అపకారం చేయరాదు.

ఈ కథవల్ల ఉపయోగాలు-

1. పిల్లలకు కాకి, పిచ్చుక లాంటి పక్షులను పరిచయం చేయడం.
2. వ్యవసాయం చేసే విధానాన్ని, చెండ్రాకోలు, ఎద్దులతో పొలం దున్నటం... లాంటివి పిల్లలకు వివరించవచ్చు.
3. ఒకప్పుడు గ్రామాలు తిరుగుతూ గాజులు అమ్మే వారిని గాజులశెట్టి అని పిలిచేవారు.