Facebook Twitter
మాట వినని దయ్యం!

మాట వినని దయ్యం!

G.హరిత

అనగనగా ఒక ఊళ్లో రంగమ్మ, రంగన్న అనే దంపతులు ఉండేవారు. రంగన్న చాలా మంచివాడు. రంగమ్మ మాత్రం గయ్యాళిది. భర్త ఎడ్డెమంటే ఆమె తెడ్డెమంటుంది. మగని మాటను ఆమె ఏనాడూ మన్నించేది కాదు. ఎప్పుడూ రంగన్నకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండేది.

ఇలా ఉండగా ఓసారి కుండపోత వర్షం మొదలైంది. ఆ సమయానికే దంపతులిద్దరూ వేరే ఊరికి వెళ్లవలసి వచ్చింది! ఇద్దరూ పూర్తిగా తడిసిపోయారు. దారిలో వాళ్ళు దాటవలసిన వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నది. 'వాగు దాటద్దు, ఇక్కడే, ఓ చెట్టుకింద తలదాచుకుందాం!' అన్నాడు రంగన్న. 'వీలుకాదు, సమయంలేదు! వానలోనే వాగును దాటి తీరాలి!' అన్నది రంగమ్మ.

'అలా కాదే! వాగు చాలా ఉధృతంగా ఉన్నది, ఏ కొంచెం కాలు జారినా అంతే సంగతులు!" అన్నాడు రంగన్న. 'నీకేం నష్టం? ఇక్కడ ఆగితే మాత్రం నామీదొట్టు!' అన్నది రంగమ్మ. ఇక చేసేది లేక, రంగన్న ఆమె చేతిని పట్టుకొని, జాగ్రత్తగా నీళ్లలోకి దిగాడు. ఇద్దరూ ఇంకా ఏరు మధ్యకు చేరుకున్నారో, లేదో- నీళ్లలో కొట్టుకు వస్తున్న కొమ్మ ఒకటి తగులుకొని, రంగమ్మ నీళ్లలో పడిపోయింది. రంగన్న తేరుకునేలోగా ఆమె ఎక్కడికి కొట్టుకుపోయిందో- ఇక కనబడలేదు. రంగన్న మాత్రం భద్రంగా ఇల్లు చేరుకున్నాడు.

గయ్యాళి రంగమ్మ అలా చచ్చిపోయినా, ఆమె ఆత్మకు మాత్రం శాంతిలేకుండా పోయింది. ఏంచేయాలో తెలీక, పరితపిస్తూ, ఆమె ఆత్మ ఆ ఊరి జమీందారు ఇంటికి వెళ్ళింది. జమీందారుకు ఒక్కతే కూతురు- పేరు రిచా. రంగమ్మ ఆత్మ వెళ్లి ఆమెను పట్టుకొని కూర్చున్నది. పనుల్తో అసలే వ్యస్తంగా ఉండే జమీందారుకు ఇదో ప్రాణ సంకటం అయిపోయింది. ఒక్కగానొక్కకూతురు 'తాను రంగమ్మను' అని అరుస్తుంటే ఆయన చూడలేక, అనేక మంది వైద్యులను, నాటు వైద్యులను, భూత వైద్యులను రప్పించి వైద్యం చేయించాడు. అయినా ఏమీ ప్రయోజనం లేకపోయింది.

గయ్యాళి రంగమ్మ ఆత్మ మాత్రం రిచాను వదలక, అక్కడే గట్టిగా తిష్ఠ వేసుకొని కూర్చున్నది. జమీందారుకి ఇక ఈ సంగతిని దాచే వీలు లేకపోయింది. 'ఎవరో రంగమ్మ ఆత్మ జమీందారు గారి బిడ్డను పట్టి పీడిస్తున్నదట' అని అందరికీ ‌తెలిసిపోయింది. మొదట్లో పట్టించుకోకపోయినా, చివరికి రంగన్న ఎలాగైనా జమీందారు బిడ్డను కాపాడాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఎలా? కొంచెం ఆలోచించిన మీదట, అతనికి ఓ ఉపాయం తట్టింది. అతను బయలుదేరి జమీందారు ఇంటికి చేరుకున్నాడు.

రంగన్నని చూడగానే రంగమ్మ ఆత్మ చాలా సంతోషపడి, తన మామూలు తిట్లు, శాపనార్థాలు మొదలుపెట్టింది. రంగయ్య ప్రశాంతంగా ఆమె ముందు కూర్చొని, "చూడు, నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడికీ వెళ్ళద్దు. ఈ పాపను వదిలి పోయేవు, పోకు! ఎక్కడని తిరుగుతావు? ఒకవేళ ఈ పాపను వదిలి పోదామనుకున్నా- ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీసాలోకి మాత్రం దూరకు! సీసాలో చోటు నీకు సరిపోదు." అన్నాడు, ఓ సీసాను తీసి ఆమె ముందు పెడుతూ.

రంగన్న మాటలు వినగానే రంగమ్మకు, తన అలవాటు గుర్తొచ్చింది. ఖచ్చితంగా వాటికి వ్యతిరేకంగా చేయాలనుకున్నది ఆమె. వెంటనే రిచాను వదిలిపెట్టి, హడావిడిగా వచ్చి, సీసాలోకి దూరింది! పూర్తిగా దూరిందని అనిపించగానే రంగన్న ఆ సీసాకు మూతపెట్టేసి, దాన్ని తన సంచీలో వేసుకున్నాడు!

తన కూతురిని కాపాడినందుకుగాను జమీందారుగారు రంగన్నకు చాలా బహుమతులిచ్చారు! మాటవినని దయ్యానికి మందు కనుక్కున్న రంగయ్య, సంతృప్తిగా ఇల్లు చేరుకున్నాడు!