Facebook Twitter
అల్లరి దయ్యం

అల్లరి దయ్యం

- నారాయణ

 

కీకారణ్యంలోని పాడుబడ్డ బావిలో చాలా దయ్యాలు కాపురం ఉంటుండేవి. వాటి జీవితాల్ని అవి ప్రశాంతంగా గడిపేవి తప్ప ఏనాడూ అవి జనాల మధ్యకు వచ్చేవి కావు. వాటన్నిటికీ ఈ మధ్యే కొత్తగా ఉపద్రవం ఒకటి వచ్చి పడింది. ఇప్పటివరకు పిల్లగా ఉన్న సుబ్బన్న దయ్యం పెరిగి, పెద్దదై, చిలిపి దయ్యమైంది. తుంటరి పనులు చేయటం, వాళ్ళనీ వీళ్లనీ కదిలించి అల్లరి పెట్టటం, ఏడిపించి నవ్వటం దానికి నిత్యకృత్యమైంది. అది క్షణం కూడా ఊరికే కూర్చోలేక పోయేది. ముసలి దయ్యాల మీసాలు పీకేది, పిల్లదయ్యాల తోకలు పట్టి లాగేది, కుర్ర దయ్యాల బుగ్గలు కొరికి ఇకిలించుకుంటూ మాయమయ్యేది. దయ్యాలన్నీ "సుబ్బన్నకు ఎలాగైనా బుద్ధి వస్తేచాలు మహాభూతా" అని మొక్కుకోవటం మొదలు పెట్టాయి చివరికి.

అలా ఉండగా, ఒక రోజున సుబ్బన్నకు రోడ్డు మీద గజ్జెలమోత ఒకటి క్రమబద్ధంగా వినబడింది. దాని చెవులు ఉత్సాహంగా లేచి నిలబడ్డాయి. గుర్రబ్బండి! అంటే గుర్రబ్బండి మీద తను ఎక్కి పోవచ్చు! అంతే కాదు ఒక మనిషితో ఆడుకోవచ్చు కూడాను! వెంటనే అది ఒక మనిషిగా మారిపోయింది. రోడ్డుని చూసి చేతులు ఊపేసరికి నేరుగా వెళ్తున్న రోడ్డు గుండ్రంగా, మిట్టపల్లాలుగా మారిపోయింది. చేతిలో ఒక కట్టె, కట్టెకు చివర ఒక మూటతో సుబ్బన్నం దయ్యం ఇప్పుడు అచ్చం పల్లెటూరి రైతు మాదిరి కనిపిస్తోంది.

మెల్లగా గుర్రబ్బండి దగ్గరకు వచ్చేసరికి దయ్యం ఈలవేసి చేతులు ఊపి, రోడ్డు మధ్యలో అడ్డాంగానిలబడి బండిని ఆపింది. బండిలో ధనికుడు ఒకడు స్వయంగా బండిని నడుపుకొని పోతున్నాడు. " పట్నం, పట్నం" అని కేకలు పెట్టింది సుబ్బన్న. బండిలోని మనిషికి అవేమీ వినబడ్డట్లు లేదు. ఇంకా "ఏమిటి" అని ప్రశ్నిస్తున్నట్లే ఉంది అతని ముఖం. సుబ్బన్న ఏదేదో చెప్పింది. ఎంత చెప్పినా ఆ మనిషి ఒకేలా ముఖం పెట్టి చూస్తున్నాడు. అతనికి చెముడు అని గ్రహించటానికి సుబ్బన్నకు చాలా సేపు పట్టింది. ఆ తరువాత పని సులభమైంది. "నేను ఎక్కుతా" అని సైగలు చేస్తే ఎక్కమన్నాడు అతను. దయ్యం చేసే వెకిలి చేష్ఠల్ని అతను అస్సలు పట్టించుకోలేదు. దానికేసే నిశ్చలంగా చూస్తూ చిరునవ్వు నవ్వుతుంటే చిలిపి దయ్యానికి ఉత్సాహం మరింత ఎక్కువైంది. కొంచెం సేపటి తరువాత తనే బండిని నడిపిస్తానని సైగలు చేస్తే, సరేనని తలూపాడు అతను. దయ్యం పగ్గాలు చేతబట్టుకొని బండి తోలటం మొదలు పెట్టింది. ఇప్పుడు రోడ్డు ఎంత దూరం పోయినా పట్నం చేరదు! తిప్పిన తావుననే మళ్ళీ మళ్ళీ తిప్పుతుంది. "నువ్వెందుకు, నేనున్నాగా, నువ్వెళ్ళి బడలిక తీర్చుకో పట్నం రాగానే లేపుతా నిన్ను" అని గొంతు చించుకొని అరచి, సైగలు చేసి చెప్పి, సుబ్బన్న దయ్యం బండివాడిని లోపల కూర్చోబెట్టి, సంతోషంతో గంతులు వేసింది. ఇక ఆపైన బండి చిత్ర విచిత్రంగా కొంచెంసేపు నేలమీద, కొంచెం సేపు ఆకాశంలో, అటూ, ఇటూ తిరిగింది. ’లోపల బండివాడికి ఇదేమీ తెలీదు. పాపం వాడు పట్నం పోతున్నామనుకుంటున్నాడు. వాడికి మెలకువ చచ్చి చూసేసరికి ఎక్కడుండే బండి అక్కడే ఉంటుంది!" ఈ ఊహే సుబ్బన్న దయ్యానికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎగురుకుంటూ బండి తోలుతూ అది రాత్రి చీకట్లో తను బండివాడిని ఎలా భయపెట్టి ఆటలు పట్టించనున్నదో ఆలోచించుకొని ఇంకా ఇంకా మురిసి పోయింది.

క్రమంగా చీకట్లు ముసురుకున్నై. బండి అటూ ఇటూ పోయి బయలుదేరిన చోటికే వచ్చి ఆగింది. సుబ్బన్న దయ్యం అరిచింది- " ఓ బండాయనా, లే, పట్నం వచ్చింది" అని. జవాబులేదు. ఓహో, చెవిటి, మూగ కదూ, అనుకొని బండిలోనికి తొంగిచూస్తే బండివాడు అక్కడ లేడు! బండి పైన కూర్చొని నవ్వుతున్నాడు.

"ఏమి సంగతి? పట్నం బాగుందా?" అని సైగలు చేసింది సుబ్బన్న దయ్యం.

" ఓ, బాగుంది. బాగుండకేం? " అన్నాడు బండివాడు.

"అరే, నీకు మాటలొచ్చా? " అంది సుబ్బన్న.

"నిక్షేపంగా వొచ్చు. ఏదో, చల్లటిపూట, షికారుగా తిరుగుదామని బయలుదేరితే, నువ్వు చాలా సాయం చేశావు పాపం" అన్నాడు బండివాడు.

"అదేంటి, నిన్నింకా పట్నం చేర్చందే? " అన్నది సుబ్బన్న.

"పట్నం ఎందుకు?" అన్నాడతను. "అయినా పాపం, నన్ను, నా బండిని, గుర్రాల్ని అన్నిటినీ నేలమీద నడిపి, నీళ్లల్లో తేల్చి, ఆకాశంలో ఎగిరించి నువ్వు చాలా అలసిపోయినట్లునావు పాపం, నీ రుణం ఎలా తీర్చుకోవాలో, ఏమో- అన్నాడు బండివాడు.

సుబ్బన్న దయ్యం నిర్ఘాంతపోయింది. "నేను ఇంత సేపూ బండి మీద కూర్చొని చల్లటిగాలిని హాయిగా ఆస్వాదించాను. నీకు కృతజ్ణతలు" అన్నాడు బండివాడు.

"ఇప్పుడే ఏమైంది, నిన్ను నిజంగా కొరికి తినేస్తే ఎంత మజానో నీకు తెలిసి వస్తుంది " అన్నది సుబ్బన్న నిజరూపం దాల్చి, కోరలు చూపెడుతూ.

" నాకూ ఉన్నాయమ్మా, కోరలు, అదీ గాక దయ్యాలు దయ్యాల్ని తినవు! " అంటూనే బండివాడు ఇంకో దయ్యంగా మారిపోయాడు. " నువ్వు అందరినీ ఆటపట్టిస్తే, నిన్ను ఆటపట్టించేవాడు ఒకడు ఉంటాడని మరువకు " అన్నది ఆ దయ్యం ఇకిలిస్తూ, మెరిసే కళ్లతో.

ఆ తరువాత సుబ్బన్న దయ్యం ఎవరిని ఏడిపించాలనుకున్నా, ముందుగా దానికి ఆ దయ్యమే గుర్తువచ్చేది. ఆ పైన రాను రాను అల్లరి చెయ్యలేక అదీ మిగిలిన దయ్యాలమాదిరి మంచిదైపోయింది.

 

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో