Facebook Twitter
నెమలి కల

నెమలి కల


రచన: M.చంద్ర శేఖర్,

10వ తరగతి, ప్రకృతిబడి,

చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.


కనగానపల్లి చుట్టూతా రమణీయమైన ప్రకృతి ఉండేది. అడవి, కొండలు, వాగు-వంకలతో ఆ ప్రదేశం పచ్చగా కళకళలాడుతూ ఉండేది. ఊరి ప్రజలంతా అడవులపైనే ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఊళ్ళో సిసింద్రి- విష్ణు అనే అన్నదమ్ములిద్దరు నివసిస్తూ ఉండేవాళ్ళు.
సిసింద్రి-విష్ణులకు ఇద్దరికీ అడవి అంటే చాలా ఇష్టం. అయితే బడికి వెళ్ళే పిల్లలు కావటంతో అడవికి వెళ్ళేందుకు పెద్దగా సమయం చిక్కేది కాదు. అడవిలో ఉండే పక్షులు, జంతువుల్ని చూడటం, అడవిలో దొరికే రకరకాల పండ్లు తినటం, అలా ఊరికే నడచుకుంటూ పోవటం - ఇవన్నీ వాళ్ళిద్దరికీ బలేగా అనిపించేవి.

ఒకరోజున, వాళ్ల బడికి అనుకోకుండా శలవు ఇచ్చారు. సిసింద్రి-విష్ణులు ఇద్దరూ 'ఏం చేద్దామా?' అని ఆలోచించి, అడవికి వెళ్ళొద్దామనుకున్నారు. అక్కడ ఒక వంకలో చాలా సేపు ఈతకొట్టి, దగ్గర్లోనే ఉన్న ఈత చెట్లోంచి పళ్ళు కోసుకొని తిన్నారు. అంతలో విష్ణుకు ఒక నెమలి కనబడింది.
మెరిసిపోయే పింఛంతో, నిగనిగలాడే ఈకలతో, నేలబారున, ఈడుస్తూ పోయే తోకతో ఉన్న ఆ నెమలి, సంతోషంగా అరుస్తూ నాట్యం చేయటం మొదలు పెట్టింది! అప్పటివరకూ వాళ్లకు ఆ అడవిలో నెమళ్లున్నాయని తెలీనే తెలీదు- ఇప్పుడు అకస్మాత్తుగా నెమలి కనబడటంతో ఇద్దరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులైపోయి, గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు.

"అన్నా! అన్నా! నాకొక నెమలి ఈక కావాలి!" అన్నాడు విష్ణు గుసగుసగా.
"దాని ముక్కు చూడరా, ఎంత గట్టిగా ఉందో! ఒక్క పోటు పొడిచిందంటే అంతే సంగతులు!" అన్నాడు సిసింద్రి.
"మరి సుబ్బుగాడి దగ్గర ఒక మంచి నెమలి ఈక ఉన్నది గదా, అదెట్లా వచ్చింది?" అడిగాడు విష్ణు.
"వాళ్ల నాన్న ఏమైనా వేటగాడో, ఏమో మరి? లేకపోతే నెమలే వాడికి ఒక ఈకను ఇచ్చిందేమో?" అన్నాడు సిసింద్రి.
"మనకూ ఒక ఈకని ఇమ్మందాం- ఏం చేస్తుందో చూద్దాం" అని, విష్ణు పొదల్లోంచి ముందుకు పరుగెత్తాడు. అయితే అలికిడి వినగానే తలత్రిప్పి చూసిన నెమలి, పెద్దగా అరుచుకుంటూ చెట్టుమీదికి ఎగిరి, గబ గబా ఎటో వెళ్ళిపోయింది!

విష్ణు నిరాశచెందాడు. ఆ నిరాశలో ఎటో చూసుకుంటూ నడుస్తున్న వాడికి, ఒక నేరేడు చెట్టును చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లైంది. గబగబా నేరేడు చెట్టు దగ్గరికి పరుగెత్తారు ఇద్దరూ- అయితే చెట్టు పెద్దగా ఉంది, చాలా నునుపుగా కూడాను! దానిక్రింద మామూలుగా పడి ఉండాల్సిన నేరేడు పళ్ళేవీ, ఎందుకో మరి, ఒక్కటీ లేదు!
"చెట్టు పైకి రాళ్ళు వేద్దామా?" అన్నాడు విష్ణు ఆశగా.
"వద్దు వద్దు- పాపం చెట్టుకు దెబ్బ తగిలి నొప్పి పుడుతుంది" అన్నాడు సిసింద్రి.
"మరి ఎట్లాగైనా నెమలిని వెతికి పట్టుకొని, ఒక ఈక పీకి ఇవ్వు" మారాం చేశాడు విష్ణు.
"తప్పు తమ్ముడూ! చెట్టుమీదికి రాళ్ళు వేస్తే చెట్టుకు నొప్పి పుడుతుంది; ఈకలు పీకితే నెమలికి నొప్పి పుడుతుంది!' అన్నాడు సిసింద్రి- "సాయంత్రం అవుతున్నది- పద ఇంటికి పోదాం" అని లేస్తూ.
విష్ణుకు అస్సలు అడవిని వదిలి పోబుద్ధి కాలేదు. "అయినా అన్న నిర్ణయం! వెళ్లక తప్పదు! సాయంత్రం అవుతున్నది! నెమలికి నొప్పి పుడుతుంది! చెట్టుకూ నొప్పి పుడుతుంది!"- ఇవే ఆలోచనలు నడుస్తూండగా, వాడూ అన్నవెంబడి నడిచి, ఇల్లు చేరుకున్నాడు.
అదే సంగతి ఆలోచిస్తూ పడుకున్న విష్ణుకు ఆరోజు ఒక కల వచ్చింది: అడవిలో కనబడ్డ నెమలి వాళ్ళ ఇంటికి వచ్చింది! అది తినేందుకు ఏం తెచ్చుకున్నదో తెలుసా? నేరేడు పళ్లు! చాలా నేరేడు పళ్ళు తెచ్చుకొని, అది వాళ్ళింటి గడపమీదే పెట్టుకొని తిన్నది. అంతలో చిన్న చిన్నగా వాన మొదలైంది. ఇంటి ముందు జలజలా వాన పడుతుంటే ఆ నెమలికి చాలా సంతోషం వేసింది. వెంటనే అది పురి విప్పి, ఎంతో అందంగా నాట్యం చేసింది! చేసీ చేసీ అలిసిపోయి, అది ఒక ఈకను అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది!

నవ్వుముఖంతో నిద్రలేచిన విష్ణును చూసి అమ్మ మురిపెంగా "ఏమిరా, విష్ణూ! నేరేడు పళ్ళు బాగా తిన్నట్లున్నావే, ఇంటి ముందంతా విత్తనాలు పడేశావేంటి?" అన్నది. విష్ణు గబగబా లేచి పరుగెత్తుకొని పోయి చూశాడు- నిజమే.. ఇంటి ముందంతా నేరేడు పళ్ళ విత్తనాలు పడి ఉన్నై! ఇంటి ముందు నేలమీద అంతా కోళ్లు తిరుగాడినట్లు కాలి గుర్తులున్నై.. వెతికి చూడగా వాడికి ఒక నెమలీక దొరికింది కూడాను!!కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో