Facebook Twitter
జెండా వందనం

జెండా వందనం


రచన: మోహనయ్య

నా పేరు రాజు. మా చెల్లి జ్యోతి. మాఇంట్లో నేను, జ్యోతి, మా అమ్మ, నాన్న నలుగురమే ఉంటాం. మా ఊళ్లో ప్రాధమిక పాఠశాల ఒకటి ఉంది- చాలా మంది పిల్లలం బడికి పోతుంటాం, ఆగస్టు 15న మా బళ్లో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుందామన్నారు మా అయ్యవారు. అందరం సంబరంగా సరేనన్నాం. ఎవరెవరు ఏం తెస్తార్రా అంటే పిల్లలంతా ఉత్సాహంగా మేం ఇవి తెస్తామంటే ఇవి తెస్తామని చెప్పటం మొదలెట్టారు. రవి వాళ్ల నాన్న మిఠాయి దుకాణం నడుపుతాడు- అందరికీ స్వీటు తెచ్చిస్తానన్నాడు రవి.

లత వాళ్లమ్మనడిగి అందరు ఆడపిల్లలకూ సరిపడ మల్లెపూలు తెస్తానన్నది. నేను జ్యోతి మాత్రం ఏమీ అనలేక ఊరికే ఉండిపోయాం. మా యింట్లో పరిస్థితి సరిగా లేదు. మా అమ్మ, నాన్న ఇద్దరూ అడవికి వెళ్లి పని చేసినా మాకు భోజనానికే సరిపోవటం లేదు- ఇక బడికి మేం ఏమివ్వగలం? "ఏం రాజూ- జ్యోతీ, మీరు కూడా ఏదైనా తెచ్చివ్వాలర్రా," అన్నారు అయ్యవారు. మేం బదులు చెప్పకుండా నిల్చున్నాం. " మీరిద్దరూ ఈ పండగకు అతిముఖ్యమైన జెండా తీసుకు వచ్చి ఇవ్వాలి. -సరే, పిల్లలూ, మీరంతా ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా తయారై రేపు ఉదయం 8 గంటలకల్లా బడికి రండి. జెండావందనం పాటలు నేర్చుకొని రావాలి, సరేనా అన్నారు అయ్యవారు.

రాజు, జ్యోతి కాళ్లీడ్చుకుంటూ ఇంటిదారి పట్టారు. "ఏం చేద్దామంటావు?" అడిగాడు రాజు. "ఏముంది, అమ్మనడుగుదాం, జెండా కొనాలంటే ఏమైనా డబ్బులిస్తుందేమో" అన్నది జ్యోతి. " అలాకాదు, అమ్మ దగ్గర మాత్రం డబ్బులు ఎక్కువ ఉండవు కదా" అన్నాడు రాజు. "ఒక పని చేస్తే?, మనమే జెండా తయారు చేస్తే? " అన్నది జ్యోతి. రాజు ముఖం వికసించింది- " అవును. మనం జెండాను తయారు చేద్దాం! అందరూ జెండాలు కొంటారు; కానీ మనం మనింట్లో ఉన్న పాత ధోవతీతో జండాని తయారు చేయచ్చు!" అన్నాడు రాజు.

వెంటనే ఇద్దరూ ఉత్సాహంగా పనిలోకి దిగారు. జ్యోతి ఇంటికి పరుగెత్తి వాళ్లమ్మ నడిగి ట్రంకు పెట్టెలో ఉన్న పాత ధోవతీని బయటికి తీసింది. రాజు అడవికి పోయి దొండతీగ ఆకులు, గరకమాకులు, దొండ పండ్లు, నాగజెముడు-పాపచ్చికాయలు కోసులు వచ్చాడు. వాళ్లమ్మ సూది-దారంతో బట్టను సరైనవిధంగా మడిచి జెండా ఆకారంలో కుట్టిపెట్టింది. ఇద్దరూ కలిసి కూర్చుని, బట్టను మూడు భాగాలుగా చేశారు. దొండపండ్లు, నాగజెముడు పండ్లను బాగా పిసికి పై భాగంలో రుద్దారు. బండమీద ఆకుల్ని బాగా మెత్తగా నూరి ఆ పసరును జెండా క్రింది భాగానికి పట్టించారు.

జ్యోతి ఈతబర్రను సన్నగా చీల్చి, దాన్ని బ్రష్ గా వాడుతూ, ఇంకుతో జెండా మధ్యలో చక్రాన్ని గీసింది. అంతే, ముచ్చటైన జెండా తయారైంది! మా ఆనందానికి అవధులు లేవు.మేం చేసిన పనికి అయ్యవారు ఏమంటారోననుకుంటూనే మరునాడు ఏడు గంటలకల్లా బడికి చేరుకున్నాం. చాలామంది పిల్లలు అప్పటికే వచ్చి ఉన్నారు. అయ్యవారు కూడా వచ్చేశారు. మేం మాత్రం ఎవ్వరితోటీ మాట్లాడకుండా వెళ్ళి, జెండాలో పూలరెక్కలు వేసి, మడిచి కట్టి, తాడుతో పైకి ఎక్కించాం. ఎవరేమంటారో నని మా గుండెలు పీచు పీచు మంటున్నాయి.. అలాగే అన్య మనస్కంగా ఉండిపోయిన మేం కార్యక్రమం మొదలైన సంగతినే గమనించలేదు.

జెండా వందనం ఇంకా కాకుండానే, అయ్యవారు చెబుతున్నారు: " ఈ రోజున మనం రాజు-జ్యోతి లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మన పండుగకు చాలా ప్రత్యేకమైన జెండాని తయారు చేసి తెచ్చారు వాళ్ళు. దానిలో ఉన్నవి సామాన్యమైన రంగులు కావు. వాళ్ల హృదయాలలోని బాధ్యత, వాళ్లలోని సహజత్వం మన జెండా రంగులుగా రూపుదిద్దుకున్నాయి. వీరు చేసిన పని కారణంగా ఈనాటి ఈ పండుగ మరపురానిదైంది. వీరి మనసుల్లో ఉన్నంత స్వచ్ఛత మనందరిలోనూ ఉంటే మన దేశ గౌరవం అనంతకాలం నిలబడుతుంది."....

ఈ మాటలు విన్న మా గుండెలు సంతోషంతో చిందులు వేశాయి. ఆ తరువాత ఇంకెన్నడూ మా బడి పిల్లలెవ్వరూ జెండాలు కొనలేదు- ప్రకృతి దయతో అన్ని రంగులు అందిస్తుంటే, వాటినిక కొనాల్సిన అవసరం ఏముంది?