Facebook Twitter
కన్నీళ్ల ఎర్రగడ్డ


కన్నీళ్ల ఎర్రగడ్డ

 

 

అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక టమోట, ఒక ఎర్రగడ్డ, ఒక మిరపకాయ, ఒక ఐస్ క్రీం ఉండేవారు. వారంతా ప్రాణ స్నేహితులు. ఒకసారి వారంతా కలసి ఒక జాతరకు బయలుదేరారు. వారంతా దారిలో పోతుండగా, ఒక సైకిల్ ఆయప్ప వచ్చి, టమోట కాయ మీదుగా సైకిల్ని పోనిచ్చాడు. తక్కిన ముగ్గురూ జరిగినదానికి చాలా బాధపడ్డారు, కానీ ’జరిగిందేదో జరిగింది’ అని ముందుకు సాగారు.

ఒక చెరువు దగ్గరికి పోయి అందులో స్నానం చేద్దామని అందరూ కలసి అందులోకి దిగారు. చెరువు స్నానానికి వచ్చిన పిల్లవాడొకడు ఐస్ క్రీం ని చూడగానే దాని మీదికి దూకి చప్పరించేశాడు. తక్కిన రెండింటికీ చాలా బాధ కలిగింది. ఇక ఆ రెండే ముందుకు సాగాయి.

ఇంతలో బజ్జీలకోసమని మిరపకాయలు తీసుకపోతున్న పిల్లవాడొకడు దారిన పోయే మిరపకాయను చూసి దాన్ని తన సంచిలోకి వేసుకున్నాడు. ఇక ఎర్రగడ్డ మాత్రమే మిగిలిపోయింది.

’మిత్రులు లేని ఈ జీవితం నాకెందుకు?’ అని అది చాలా బాధపడుతూ, జాతరను చేరి, గుడిలోకి వెళ్ళింది. ’ఏమి దేవుడా! నా మిత్రులందరినీ నాకు లేకుండా చేశారు ఈ మనుషులు? నాకు వారి మీద చాలా పెద్ద ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది. అలాంటి వరాన్ని నాకివ్వు’ అని దేవుడిని వేడుకుంది.

అంతలోనే దేవుడు ఎర్రగడ్డకు కనిపించాడు. ’సరే ఎర్రగడ్డా! నీకోరిక తీరుస్తున్నాను. ఇకమీదట నిన్ను ఎప్పుడైనా మనుషులు కోయగానే వాళ్ళ కళ్ళవెంబడి నీళ్ళు కారుగాక!’ అని వరమిచ్చాడు. అందుకే, ఉల్లిపాయ తరిగేప్పుడు మనకు కళ్ళళ్ళో నీరుకారేది!

 

Courtesy..
kottapalli.in