Facebook Twitter
చలి చీమలు

చలి చీమలు

 

కథకురాలు : కల్యాణి

 

telugu stories for kids, telugu stories for kids in telugu, telugu story for kids,telugu kids stories, kids   stories telugu, kids story books, children short stories, funny stories for kids, online kids stories, little   kid stories

 

 

పద్యానికో కథ శీర్షికన ప్రతినెలా ఓ కథ రాస్తానంది కల్యాణి. ఆవిడ ప్రకృతి బడిలో పిల్లలకు పాఠాలు చెబుతుంటుంది.
చిన్న చిన్న చీమలు కలిసి పెనుబామును ఎలా వదిలించుకున్నాయో ఈ కథలో చూడచ్చు. సుమతీ శతక కారుడు బద్దెన రాసిన ఈ పద్యం పోరాటాలకు స్ఫూర్తినిస్తుందని అనేకమంది భావిస్తుంటారు.
ఒక అడవిలో నల్ల చీమల పుట్ట ఒకటి ఉండేది. నల్లచీమలంటే, గండు చీమలు కావు- కుట్టకుండా ఊరికే మన ఒంటిమీద గబగబా పాకుతాయే, ఆ చీమలన్నమాట. వర్షం పడేముందు అవి గుంపులు గుంపులుగా బయలుదేరి ఒక చోటునుండి ఒక చోటికి మారిపోతుంటాయి- అందుకే వాటిని ’చలి చీమలు’ అంటారు కొందరు.

అయితే, ఈ చీమల పుట్ట ఒక చెట్టు నీడన ఉండేది. అందువల్ల దానికి వర్షపు భయం లేదు. చాలా సంవత్సరాలుగా దానిలో చీమలు నివసిస్తూ వచ్చాయి; అందులో చాలా సౌకర్యాలూ అవీ ఏర్పరచుకున్నాయి; చాలా సుఖంగా ఉంటున్నాయి.

కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సుఖాలే ఎప్పుడూ ఉండాలంటే వీలవదు- కష్టాలూ వస్తాయి; వాటినీ తట్టుకొని నిలబడాలి. ఈ చీమలకు కూడా ఒక కష్టం వచ్చి పడింది- ఎక్కడినుండి వచ్చిందో, ఒక పాము చెట్టు తొర్రలోకి వచ్చి చేరుకున్నది. ఎప్పుడైనా వాన పడిందంటే, ఆ పాము చెట్టుదిగి వచ్చేది; చీమల పుట్టలోకి దూరేది. చీమలు పుట్టను తయారు చేసుకున్నది పాముకోసం కాదుగదా, అందువల్ల దానిలోపల దారులు సన్నగా, ఇరుకుగా ఉండేవి. పాము పుట్టలో దూరి, అటూ ఇటూ దారి చేసుకుంటూ, ఒళ్లు విదిలించుకుంటూ, రుద్దుకుంటూ ముందుకు, వెనక్కు, పక్కలకు తిరుగుతుంటే, పాపం, చీమలు శ్రమపడి కట్టుకున్న గోడలు కూలిపోయేవి, చాలా చీమలు చచ్చిపోయేవి, చాలా చీమలకు గాయాలయ్యేవి, అవి కష్టపడి జమచేసుకున్న ఆహారం మట్టిపాలయ్యేది.
చీమలన్నీ కలిసి పాముకు చెప్పి చూశాయి- " అయ్యా, పాము గారూ, మేం ఇన్నాళ్లుగా శ్రమపడి కట్టుకున్న ఈ పుట్టను వదిలి పెట్టండి, మీరు వేరే ఏదైనా మంచి తావును చూసుకోండి, మీరు ఇందులో దూరినప్పుడల్లా మేం చీమలం, వేల సంఖ్యలో చచ్చిపోతున్నాం.. దయచూడండి" అని మళ్లీ మళ్లీ మనవి చేసుకున్నాయి. అయినా ఆ పాము వినలేదు. చలి చీమల బాధను అర్థం చేసుకోలేదు. చీమల గోడును పట్టించుకోలేదు. వర్షం వచ్చిన ప్రతిసారీ కావాలని పుట్టలోనే దూరి నవ్వేది, కావాలని పుట్టలో అన్నివైపులా తిరిగి, ఇంకా ఎక్కువ చీమల్ని చంపటం మొదలు పెట్టింది.
చలి చీమల దవడలు ఎర్రచీమల దవడల మాదిరి గట్టిగా ఉండవు. ఎర్రచీమలు కుడితే చాలా నొప్పి పుడుతుంది; కానీ చలిచీమలు కుడితే అంత నొప్పి పుట్టదు. అయినా అవి పాము పెట్టే బాధని భరించలేకపోయాయి. ఒక రోజున కలిసి అనుకున్నాయి- "ఈసారి పాము వస్తే ఊరుకోకూడదు.. కసి తీరా కుట్టాలి, చచ్చిపోయినా పరవాలేదు" అని.

ఇంకోసారి పాము పుట్టలోకి దూరగానే చీమలన్నీ కలిసి దాని మీద దాడి చేశాయి.
పాము అటూ ఇటూ కొట్టుకున్నది, విదిలించుకున్నది, దొర్లింది, ఏం చేసినా చీమలు మాత్రం దాన్ని వదలలేదు. వేల వేల చీమలు చచ్చిపోయాయి; కానీ వాటి స్థానంలో మరిన్ని చీమలు వచ్చి కుట్టాయి. చివరికి అంత పెద్ద పాము కూడా తట్టుకోలేక చచ్చిపోయింది. కలసి పోరాడి చలిచీమలు తమ కష్టాలనుండి విముక్తి పొందాయి.

అందుకే అన్నారు:

’బలవంతుడ, నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ’ అని. 


నిజమే కదూ?