Facebook Twitter
వరద



వరద





వరద వచ్చింది-

పల్లెలకు పల్లెలే మునిగిపోయాయి.

ఇళ్లలో ధాన్యంతో సహా అన్నీ మట్టిలో కలిశాయి.

త్రాగేందుకు శుభ్రమైన నీళ్లు కరువయ్యాయి.

ఎన్ని పశువులు, పక్షులు చచ్చిపోయాయో లెక్కలేదు. ఎందరి బ్రతుకులు అల్లకల్లోలమయ్యాయో లెక్కలేదు.

రాజాల్లాగా బ్రతికిన రైతులంతా ఇతరుల దయాధర్మాలమీద జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎందుకైంది ఇలాగ?

బహుళార్ధ సాధక ప్రాజెక్టులు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి, నిజమే. అయితే దీనికోసం ఆ జలాశయాలనిండా నీళ్లుండాలి. అట్లా నీళ్ళు నిండుగా ఉంటే, మరి అవి వరదల్ని ఆపలేవు. ఇప్పుడు జరిగింది అదే. ఈ వరదల్ని ప్రకృతి తేలేదు. ఇవి పూర్తిగా మానవ నిర్మితాలు!

"కరెంటు కక్కుర్తీ, కాలువ ప్రాంతాల ఒత్తిడీ ఎప్పుడూ గెలుస్తాయి- జలాశయాల్ని ఖాళీగా ఏనాడూ ఉండనివ్వవు. అందుకని, పెద్ద ప్రాజెక్టులు తప్పనిసరిగా వరదల్ని తెస్తాయి." అని పర్యావరణ ఉద్యమకారులు ఎన్నో ఏళ్లుగా హెచ్చరిస్తూనే వచ్చారు. ఎవ్వరమూ వినలేదు.

"చిన్న ఆనకట్టలు మంచివి. చెరువులు బాగు చేయించుకోవాలి. వర్షపునీటిని సరిగా వాడుకోవాలి. నేల కోతను ఆపాలి. భూమి పైపొరల్ని కాపాడాలి. వర్షాధారిత పంటలకు పెద్దపీట వేయాలి. విద్యుత్తు వినియోగం తగ్గించుకోవాలి. పెద్ద డ్యాముల్లో పేరుకుపోయే బురద రానురాను మరిన్ని సమస్యల్ని సృష్టించనున్నది. అందువల్ల వాటిపైన ఆధారపడటం తగ్గించుకోవాలి" అని మేధాపట్కర్ లాంటివాళ్ళు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందేమో చూడాలి.

మనుషులం, ప్రకృతితో ఎంత పెద్ద స్థాయిలో తలపడతామో, మానవ తప్పిదాలకు అంత పెద్ద మూల్యం చెల్లించవలసి వస్తున్నది. అందుకని, పెద్ద పెద్ద ప్రణాలికల్ని ప్రక్కన పెట్టి, కొంచెం తగ్గి వ్యవహరించటంలోనే విజ్ఞత ఉన్నదనిపిస్తుంది- ఏమంటారు?


- kottapalli.in సౌజన్యంతో