Facebook Twitter
అసమానం



అసమానం

చలికాలం. రోజూ మంచు కురుస్తోంది. ఇప్పుడైతే సమయం ఏడు గంటలవుతున్నది. పిల్లలు రమేష్, స్వర్ణ లోపలి గదిలో ముడుచుకొని పడుకొని ఉన్నారు. వాళ్ళ నాన్న మూర్తి టీ త్రాగుతూ పేపరు చదువుతూన్నాడు. వాళ్ళమ్మ సుజాత వంటగదిలో టిఫిన్ తయారీలో ఉంది- పనమ్మాయి శాంతిని ఎప్పటిమాదిరే తిడుతోంది: "ఇదిగో, నీకు వంద సార్లు చెప్పాను- గిన్నెలు కడిగామంటే అవి తళతళలాడాలి. ఇట్లా జిడ్డోడుతూ ఉండకూడదు. మనసు ఎక్కడ పెట్టుకొని పనిచేస్తున్నావ్?" అని అరుస్తున్నది.

"అబ్బ! ప్రశాంతంగా పేపరు చదువుకోనివ్వరే! శాంతీ, ఇటొచ్చి ఈ టీ కప్పు తీసుకెళ్ళు! ప్రతిరోజూ చెప్పాలి నీకు!" రోజూ లాగే కసురుకున్నాడు మూర్తి.

"పో! పోయి సార్ దగ్గర టీ కప్పు తీసుకొచ్చి, దాన్నీ- దాంతోబాటు ఈ జిడ్డు గిన్నెల్నీ మళ్ళీ కడుగు. ఇల్లంతా ఊడ్చి తడిబట్టతో తుడువు. మనసు పెట్టు కొంచెం. అట్లా మజ్జుగా, బద్ధకంగా ఉండకు. పనులు ప్రతిరోజూ చెప్పించుకునేదెందుకు? ఇంతకీ‌ ముఖం కడుక్కున్నావా, ఇంకా దానికి ముహూర్తం అవ్వలేదా?" హుంకరించింది సుజాత.

శాంతి తలవంచుకొనే "లేదాంటీ, ఇంకా కడుక్కోలేదు- సమయం చాల్లేదు" అంది, వెళ్ళి టీ కప్పు తెచ్చి కడిగేస్తూ.
ఇల్లంతా ఊడ్చి తడిబట్టతో తుడిచేటప్పటికి ఎనిమిది కావొస్తున్నది.

మూర్తి ఇంకా పేపరు చదువుతూనే ఉన్నాడు.

పిల్లలిద్దరూ పడుకొని ఉన్న గదిలోకి వెళ్ళి, వాళ్ళకేసి మురిపెంగా చూసుకున్నది సుజాత. అమాయకంగా నిద్రపోతున్న రమేష్, స్వర్ణల్ని చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నారో! "బాబూ! నాన్నా- చిన్నా రమేష్! లే నాన్నా!- పాపా, స్వర్ణా, చిట్టి తల్లీ, లేమ్మా, లే! సమయం ఎనిమిది అవుతోంది. బడికి వెళ్ళొద్దూ? బళ్లో మీ సార్లూ టీచర్లూ అందరూ ఎదురుచూస్తుంటారు గదా?! శాంతీ! పిల్లలు లేచేసరికి వేడినీళ్ళు సిద్ధం చెయ్యాలని వందసార్లు చెప్పాను. అబ్బ, నీకు పని చెప్పటం నా బుద్ధి తక్కువ- నాయనా చిన్నా, పాపా- చిట్టి తల్లీ, లేవండిరా, లేవండి" అని ఓ పదిసార్లు ముద్దు ముద్దుగా, హడావిడిగా పిల్లల్ని లేపే సరికి మరో పదిహేను నిముషాలయింది.

లేవగానే పిల్లలిద్దరూ శాంతిమంత్రం మొదలెట్టారు-"శాంతీ! బ్రష్ ఎక్కడ? శాంతీ, పేస్టు కనబడటం లేదు! శాంతీ! నా బట్టలు ఇస్త్రీ చెయ్యలేదా? శాంతీ, అబ్బ- షూస్ పాలిష్ చేయమన్నానా- ఎంత వికారంగా చేస్తావో చూడు! నీకసలు ఏ పనీ చక్కగా రాదే? శాంతీ, జడలు వెయ్యి!"

అంతలో మూర్తి లేచి "శాంతీ! బాత్రూంలో నీళ్ళు పెట్టు! ఏ టైముకు ఏం చెయ్యాలో నీకు ఎప్పుడూ ఎవరో ఒకరు ఎందుకు చెప్పాలి? అన్నీ వరసగా చేసుకుంటూ పోవచ్చు కదా? అబ్బ, అసలు నీకు పనులు చెప్పేకంటే మా పనులు మేమే చేసుకోవటం నయమనిపిస్తున్నది" అని విసుక్కున్నాడు.

సుజాత అరిచింది వంటరూంలోంచి- "ఓ శాంతీ! మొద్దు పిల్లా! వినిపిస్తున్నదా? సారుకు నీళ్ళు పెట్టు. అంత బద్ధకంగా ఉండకు. ఇదిగో, టిఫిన్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టు. చేతులు బాగా కడుక్కో. ప్లేట్లూ, గ్లాసులూ, స్పూన్లూ అన్నీ తీసుకొచ్చి పెట్టు- చిన్న బాబూ! స్నానం అయ్యిందా? చిట్టి తల్లీ, ఎంతవరకూ వచ్చావు? శాంతీ! పాపకు జడలు వెయ్యి! చేతులు కడుక్కో, ముందు- ఎక్కడెక్కడ పెడతావో ఏమో, పది నిముషాలకోసారి చేతులు కడుక్కొమ్మంటే కడుక్కోవే?! సారు బట్టలు ఇస్త్రీ చేశావా, లేదా? వెంటనే చెయ్యి! లేకపోతే నా ప్రాణం తింటారు" వరసగా చదివింది.

శాంతి రమేష్‌కి షూస్ పాలిష్ చేసిచ్చింది; స్వర్ణకు జడలు వేసింది; సారుకు ఇస్త్రీ బట్టలు అందించింది; అన్నీ అయ్యాక సుజాతకు టిఫిన్ పెట్టింది; వాషింగ్ మెషీన్లో బట్టలు వేసింది; అప్పుడు వెళ్ళి మొహం కడుక్కున్నది- సుజాత అరుస్తోంది- "శాంతీ! ఎక్కడికెళ్ళావ్? ఎంత సేపు?! అబ్బ- నీకు చెప్పేకంటే నేను చేసుకున్నది మేలు..." అని.

శాంతికి తొమ్మిదేళ్ళు. మూడో తరగతి వరకు బడికి వెళ్ళింది. ఆ తర్వాత ఇట్లా సుజాత వాళ్ళింట్లో పనికి కుదురుకున్నది. ఎవరేమన్నా, నవ్వుతూ- నిబ్బరంగా- అమాయకంగా- పనులు చేస్తూ పోతుంది.

ఇట్లా లెక్కలేనంతమంది శాంతులు- పసితనంలోనే అంతలేసి బరువుల్ని మోసే పెద్దవాళ్ళు. ఎంత సాయం చేసినా కూసింత మెప్పూ పొందని చిన్నారులు- వీళ్లకి వేరే మంచి అవకాశం ఏదైనా ఉంటే బాగుండు గదా, మంచి ప్రత్యామ్నాయం దొరికితే బాగుంటుంది.

మూర్తిగారిలాంటి పెద్దలు ప్రొద్దునే పేపరు చదవటం తగ్గించుకొని ఇంటిపనులు చేసే రోజులొస్తే బలే ఉంటుంది. సుజాతలాంటి తల్లులు తమ పిల్లలమీద చూపించే ప్రేమలో ఓ చిన్న భాగాన్ని శాంతి లాంటి అసమానులకూ కేటాయించగల్గితే బాగుండు.

రమేషులూ, స్వర్ణలూ తమ తోటి పిల్లల ప్రతిరూపాల్ని శాంతుల్లోనూ చూడగల్గితే బాగుండు. -కదూ?

చక్కని హృదయాలున్న మీకందరికీ ఈ చలికాలంలో వెచ్చటి అభినందనలు!

.......... kottapalli.in

సౌజన్యంతో