Facebook Twitter
సమిష్టి కృషితో సర్వం సాధ్యమే..!

ఒక్క నీటిచుక్కకు
విలువలేక పోవొచ్చు...
అది మన దాహాన్ని
తీర్చలేక పోవచ్చు ...
పొలంలోని పైరుకు
ప్రాణం పోయలేకపోవొచ్చు...

కానీ కారుమబ్బులు కమ్మి
లెక్కపెట్టలేనన్ని నీటిచుక్కలు
నేలపై ఏరులై సెలఏరులైపారితే‌...
వరదలు ముంచెత్తవచ్చు...
ఊర్లకు ఊర్లే ఊడ్చుకుపోవచ్చు...
పచ్చని పంటలు నాశనం కావచ్చు...
ప్రజల ప్రాణాలకు ముప్పురావచ్చు...

నిజానికి...
ఒక్కఅగ్గిపుల్ల చాలు 
దేనినైనా దగ్ధం చేయడానికి...
కారడవిని సైతం కాల్చివేయడానికి...

నిజానికి...
ఒక్క చీమకు ఏశక్తీ లేకపోవచ్చు
కానీ వేలకువేలు చలిచీమలు ఏకమైతే
బుసలుకొట్టే సర్పాలను సంహరించవచ్చు

ఔను ఇది నిజం ఒంటరిగా
ఎవరేమి సాధించలేకపోవొచ్చు...
కాని "సమిష్టిగా సర్వం సాధ్యమే"...
పోయిన హక్కులకై పోరాడవచ్చు...
ప్రశ్నించవచ్చు ప్రతిఘటించవచ్చు...
ఘన విజయాలను సాధించవచ్చు...