Facebook Twitter
ఏడుకొండలవాడా ! వెంకటరమణా! గోవిందా ! గోవిందా !

వేస్తారు...వేస్తారు...

వెంకటేశ్వరుని మెడలో 

మిలమిల మెరిసే ముత్యాల 

రత్నాల బంగారు హారాలు 

కోట్లఖరీదైన వజ్ర వైఢూర్యాలు 

 

చేస్తారు...చేస్తారు...

హారతి కర్పూరాలతో 

అర్చనలు అభిషేకాలు 

పూజలు పునస్కారాలు 

 

చేస్తారు... చేస్తారు...

పాలతో పాలాభిషేకాలు 

పూలతో పూలాభిషేకాలు 

ఊరంతా ఊరేగింపులు 

ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు  

 

కోరుకుంటారు వేడుకుంటారు

కనిపించమని కరుణించమని 

కాపాడమని కోర్కెలు తీర్చమని

ఏడుకొండలవాడా ! వెంకటరమణా !

గోవిందా ! గోవిందా ! అంటూ గొంతెత్తి

దిక్కులుపిక్కటిల్లేలా... నినదిస్తారు 

 

ఒక్కసారి కాలినడకన

ఏడుకొండలు "ఎక్కిన" చాలు 

ఒక్కసారి ఆ వెంకటేశ్వరుని 

పాదపద్మాలకు"మ్రొక్కిన"చాలు   

ఒక్కసారి తలనీలాలు 

"సమర్పించుకున్న" చాలు 

 

ఒక్కసారి ఒక్కక్షణం 

కనులారా తనివితీరా

ఆ దివ్యమంగళ రూపాన్ని  

"దర్శించుకున్న" చాలు 

మన బ్రతుకు ధన్యమే

దక్కును ఈ జన్మకు

వేయిజన్మల "పుణ్యఫలమే"