Facebook Twitter
ఆరు అక్షరాల అంటువ్యాధి ?

ఓ బహుజన బిడ్డలారా!

దశాబ్దాలుగా శతాబ్దాలుగా 

మనుస్మృతి మంటల్లో 

శభలాలుగా పడి శవాలుగా మారిన 

ఆ "మూడుతరాల మూగవేదనను" 

తెలుసుకోండి... తెలుసుకోండి

 

కఠోరమైన కట్టుబాట్లు పెట్టి 

సాంప్రదాయ సంకెళ్లు చుట్టి 

అర్ధంలేని ఆచారాల అడ్డబొట్లు పెట్టి 

నియమనిష్టల నిలువుబొట్లు పెట్టి 

మూఢాచారాల మురికికూపంలో 

పీకలవరకు కూరుకుపోయిన నాటి 

పీఠాధిపతులు రగిలించిందే

ఈ ఆరుఅక్షరాల "అగ్నిగుండమని"

తెలుసుకోండి... తెలుసుకోండి

 

కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి 

మనిషి మనిషి మధ్య మంటలు రేపి

అంతులేని అగాధాలను సృష్టించిన 

నాటి మనుమాంత్రికుని మాయాజాలమే 

ఈ ఆరుఅక్షరాల "ఆరని కుంపటని"

తెలుసుకోండి... తెలుసుకోండి

 

తాము చెప్పిందే వేదమంటూ 

తాము నమ్మిందే సిద్ధాంతమంటూ 

ఎంతకు మారని అగ్రవర్ణాల అంతరంగాల్లో 

పుట్టిందే ఈ ఆరుఅక్షరాల "అంటువ్యాధి"అని

తరతరాలుగా నరనరాల్లో పేరుకున్న ఈ జాడ్యం  

రావణకాష్టంలా రగులుతూనేవుందని 

తెలుసుకోండి... తెలుసుకోండి

 

అందుకే ఓ బహుజన బిడ్డలారా!

నిద్రమేల్కొని ఇకనైనా 

నిజం తెలుసుకోండి!

ఈ కంప్యూటర్ యుగంలోనైనా 

కళ్ళుతెరుచుకోండి!

పోయిన హక్కులు ప్రార్థనచేస్తే 

ప్రాధేయపడితే దక్కవని

పోరాడితే పోయేది ఏమీలేదు 

మీ బానిసత్వపు సంకెళ్లేనని

సంఘంలో సమానత్వం 

ఒక్క విద్యద్వారానే సాధ్యమని

బలమైన ఒక ప్రభుత్వం 

బలహీనుల చేతుల్లోనే వుందని

రాజ్యాధికారానికి సఖ్యత ఐక్యతే 

ఆయుధమని, కలనైనా మరవకండి కలిసి,

సింహాల్లా పోరాడితే సింహాసనం మీకేనండి