Facebook Twitter
అన్నా..! ఓ ఓటరన్నా..! నీవు ఓడరాదు..! నీ ఓటు ఓడరాదు..!

అయ్య బాబోయ్ వచ్చేస్తున్నాయట..!
తేళ్ళు...తోడేళ్ళు...విషసర్పాలు...
ఊసరవెల్లులు...బంగారు బల్లులు...

ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..?
ఓ ఓటరన్నా..! నీకేటి భయం...

నీ వ్రేలికి ఉందిగా..."సుదర్శన చక్రం"
నీ భుజం మీద ఉందిగా..."గండ్రగొట్టలి"
నీ అరచేతిలో ఉందిగా..."అణుబాంబు"
నీ వ్రేలిమీద వేసే సిరాచుక్కలో ఉందిగా...
ఓటనే "వజ్రాయుధం"...
నీ హక్కుల అంబుల పొదిలో ఉందిగా...
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి .ఆర్.
అంబేద్కర్ అందించిన..."రామబాణం"...
ఆ రామబాణాన్ని సంధించాలి
రాజకీయ రాక్షస రావణాసురులను
కారడవులకు పంపాలి
రామరాజ్యాన్ని స్థాపించాలి
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి...

అమ్మ బాబోయ్ వచ్చేస్తున్నాయట..!
గుడ్లగూబలు...
గుంటనక్కలు...
కులం గజ్జి కుక్కలు...
గోడమీది పిల్లులు...
గోముఖ వ్యాఘ్రాలు...
దోపిడీ దొంగలు...కొల్లేటి కొంగలు...

ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..?
ఓ ఓటరన్నా..! నీకేటి భయం...

నీ ఆత్మసాక్షిగా...
నీ ఆయుధాలు నీవు ధరించి...
నిర్భయంగా...నిష్పక్షపాతంగా...
నీళ్ళను పాలను వేరుచేసే హంసలా...
నీవు విజ్ఞతతో విచక్షణతో ఓటు వేయాలి...
రేపు నీకు పగటిపూటే చుక్కలు చూపించే
ఆ "అవినీతి అనకొండలకు"
ఆ "అడవి పందికొక్కులకు"
నీవు చుక్కలు చూపించాలి

అయ్య బాబోయ్ వచ్చేస్తున్నారట..!
మేకవన్య పులులు...
తేనె పూసిన కత్తులు...
మాటల మాంత్రికులు...
అరచేతుల్లో స్వర్గాన్ని
చూపించే అబద్దాలకోరులు...

ఏమి వస్తేనేమోయ్..?
ఎవరు వస్తేనేమోయ్..?
ఓ ఓటరన్నా..! నీకేటి భయం...

కానీ ఓ ఓటరన్నా..!
నీతిమంతులను...
నిస్వార్థపరులను...
సేవాతత్పరులను...
పరమాత్మ స్వరూపులను...
ఘనులను త్యాగధనులను...
ఆపదలో ఆదుకునే ఆత్మబంధువులను...
సమస్యలకు స్పందించే సహృదయులైన...
నేతలను నీవు గెలిపించాలి నీవు గెలవాలి...
నీవు ఓడిపోరాదు....నీ ఓటు ఓడిపోరాదు...