ఔరా ! బడా నాయకులే భక్తులైతే...?
కార్పోరేట్ దుష్టశక్తులకు బానిసలైతే..?
ఏమౌతుంది... ప్రతి రాష్ట్రం
రావణకాష్టంలా రగులుతుంది...
మణిపూర్ లా మతోన్మాద
మంటల్లో పడి కాలి బూడిదౌతుంది...
నిన్న విధి చెప్పింది.....ఓ విషాధ గాథ
నేడు కాలం పాడింది...ఓ కన్నీటి పాట
విధి చెప్పిన...ఆ విషాధగాథ
ఏడ్చే పాపలకు తెలుసు...
ఎగిరే పక్షులకు తెలుసు...
కాలం పాడిన...ఆ కన్నీటి పాట
కడుపులో దూరిన కత్తులకి తెలుసు...
నడివీధిలో నగ్నంగా
ఊరేగింపబడిన కుకీమహిళలకు తెలుసు...
విధి చెప్పిన...ఆ విషాధ గాథ
చిరిగిన చీరలకు తెలుసు..
పగిలిన గాజులకు తెలుసు...
కాలం పాడిన...ఆ కన్నీటి పాట
నక్కినక్కి తిరిగె మైతీకుక్కలకు తెలుసు...
ముక్కలైన కుకీపూలమొక్కలకు తెలుసు...
విధిచెప్పిన...ఆ విషాధ గాథ
కళ్ళు మూసుకున్న ఏసుక్రీస్తుకు తెలుసు...
గోడకు వ్రేలాడె శ్రీరామచంద్రుడికి తెలుసు...
కాలంపాడిన...ఆ కన్నీటి పాట
తెగిన తాలిబొట్లకు తెలుసు...
రాలిన రక్తపుచుక్కలకు తెలుసు...
పరిమళించే మంచితనం...
మానవత్వం...అమాయకత్వం...
స్వచ్చమైన స్నేహం...సౌభ్రాతృత్వం...
"పాలుతేనెల్లా" ప్రవహించే మణిపూర్ లో
ఏ మతోన్మాదుల వికృత సృష్టియో ఇది..? ఔరా జాతుల మధ్య ఈ జగడాలేమిటి...?
ఘడియఘడియకు ఈ ఘర్షణ లేమిటి..?
మతం పేర ఈ మారణ హోమమేమిటి..?
సందేహమే లేదు ?
ఇది కార్పోరేట్ శక్తులు...
భక్తులైన బడానాయకులు...
ఏకమై సృష్టించిన భీభత్సమే నరమేధమే...
భక్తి ముసుగులో జరుగుతున్న భాగోతమే...



