Facebook Twitter
ఆమెంటే నాకెంతో ఇష్టం..!

ఆమెంటే...
ఆమె చిరునవ్వంటే...
కొరడాలతో కొట్టే
ఆమె కోర చూపంటే...
మన్మధ బాణాలు విసిరే
ఆమె చురుకైన చూపంటే...
మత్తెక్కించే ఆమె
మధుర ధరహాసమంటే...

ఆమె కాటుక
కళ్ళంటే...వంకర్లు తిరిగే
ఆమె నాజూకైన నడుమంటే...
నెమలిలా నడిచే ఆమె నడకంటే...
నాకు గుండెల్లో గుబులే...ఔను

ఆమె ఎవరు..? ఆమె గుడిసెలో
ఆరిపోయే...ఓ గుడ్డి దీపం..!

ఆమె ఎవరు..?
ఆమె వీధిలో చెత్తకుండీలో
విసిరిన... ఓ విస్తరాకు..!

ఆమె ఎవరు..?
ఆమె కుక్కలు కుస్తీ బట్టి
తినే...ఓ ఎంగిలి మెతుకు..!

ఆమె ఎవరు..?ఆమె చీకటిలో
చిగురించే...ఒక చిరునామా..!

ఆమె ఎవరు..?
ఆమె ఆకలికి అలమటించే
అస్థిపంజరాలకు...ఓ అమ్మ..!

ఆమె ఎవరు..?
ఆమె మందుబాబుల ముందు
అందాలారబోసే...ఓ అంగడి బొమ్మ..!

ఆమె మసక మసక
చీకటిలో చిందులు వేస్తుంది..!
విటులకు విందులు చేస్తుంది..!
ఆమె తన, తనపిల్లల
పగటి ఆకలి తీరడం కోసం
రాత్రి ఎందరికో ఆకలి తీరుస్తుంది..!

అందుకే ఆ మెంటే...
నాకెంతో ఇష్టం...నాకే కాదు
ఇరుకైన ఇళ్ళల్లో ఇష్టమైనది
దొరకని ఇంకెందరికెందరికో ఇష్టం...!