Facebook Twitter
మా అల్లుడు బంగారం

వచ్చీ రాకముందే ఇంటికి 

కొత్త పాత లేకుండా అల్లుడు 

అత్తమామలకు పాదాభివందనం చేశాడు 

ఆహా ! అల్లుడెంతటి వినయసంపన్నుడు!

 

పెళ్లిచూపుల్లో నచ్చిందా బాబు 

పిల్లంటే నవ్వి ఊరుకున్నాడు 

కనుసైగలతోనె కథ ముగించాడు 

ఆహా ! అల్లుడెంతటి మృదుభాషి !

 

నిశ్చితార్థం రోజు వియ్యాలవారు 

కయ్యాలవారు కట్నకానుకల 

ప్రస్తావన తెస్తే కస్సుమని పైకి లేచాడు 

ఆహా ! అల్లుడెంతటి ఆదర్శవాది !

 

పెళ్లిరోజు ఆర్భాటమక్కర్లేదని 

కళ్యాణమండపం ఖర్చెందుకని 

గుళ్ళో పూలదండలు మార్చుకుని 

మూడు ముళ్లతంతు ముగించాడు 

ఆహా ! అల్లుడెంతటి అభ్యుదయవాది !

 

పెళ్లికి వచ్చిన అక్షింతలు చల్లిన హితులకు 

స్నేహితులకు అతిథులకు అరిటాకుల్లో

పప్పన్నం పెట్టి నాలుగు స్వీట్లిచ్చి నవ్వుతూ 

పంపాడు ఆహా ! అల్లుడెంతటి పొదుపరి !

 

శోభనంరాత్రి గదిలో స్వీట్ హాట్ 

పాలు పళ్ళు పూలు పట్టెమంచం 

అగరవత్తులు అక్కర్లేదన్నాడు 

చల్లని వెన్నెల్లో శోభనం చాలన్నాడు 

ఆహా ! అల్లుడెంతటి అల్పసంతోషి!

 

ప్లాట్లు లక్షల కోట్ల కట్నం ఖరీదైనకార్లు 

కలర్ టీవీలు కావాలని కొత్తకోరికలతో

అత్తమామల రక్తాన్ని పీల్చేపిప్పిచేసే 

ఆధునిక అల్లుళ్ళున్న ఈ కలికాలంలో

ఈ ! అల్లుడెంతటి ఉదార‌హృదయుడు !

 

తమది ఎంతో మహద్భాగ్యమని 

కూతురుకాపురం స్వర్గతుల్యమేనని

కమ్మని కలలుకనే అత్తమామల ఆ

"పెళ్లికల" విధివక్రించి విషఘడియలు ప్రాప్తించి 

పగటికలగా పిచ్చికలగా పీడకలగా మారింది 

అల్లుడు కోరిన పిచ్చికోరికలతో 

అత్తమామలు బిత్తరపోయారు 

అల్లుడు పెట్టిన ఆ "వింత షరతులకు" 

ఇద్దరి హృదయాలు బ్రద్దలయ్యాయి 

 

పాలగ్లాసుతో కాదు...బీరుగ్లాసుతో...

కోటిరూపాయల....బ్రీఫ్ కేసుతో"

పడకగదికి కూతుర్ని పంపాలని 

అప్పుడే ఇద్దరికి శోభనమని 

అమెరికా..."అల్లుడి‌ ఆజ్ఞ"

ఆహా ఎంతటి మోసం ?ఎంతటి దగా ?

ఔను మరి "అల్లుడా ! మజాకా" !