Facebook Twitter
సమతా మమతల శాంతిశిఖరం

చిరు ప్రాయంలోనే
కన్నవారు దూరమైనా
పినతండ్రి పెంపకంలో పెరిగిన
శాంతిదూత ముహమ్మద్ ప్రవక్త...
ఖురేష్ తెగల బహుదేవతా
విగ్రహారాధనకు బద్దవ్యతిరేకి...

ఆధిపత్యంకోసం దాడులు
దండయాత్రలు చేసుకుంటూ
రక్తదాహంతో
పగాప్రతీకారాలతో
రగిలిపోయే తెగలతో
బద్ర్...ఉహద్...ఖందఖ్...
హునైనుల్లో యుద్ధభేరీలను
మ్రోగించి అరేబియా తెగల
తిరుగుబాటుదారుల్ని అణచివేసి
రక్తపాత రహిత ఆక్రమణతో
ఆథ్యాత్మిక ఇస్లామిక్
సామ్రాజ్య స్తాపనచేసి
"కాబా" గృహంలో మక్కావాసులు
భక్తి శ్రద్ధలతో ఆరాధించే
"360 విగ్రహాలను" తొలగించిన మహాయోధుడు ముహమ్మద్ ప్రవక్త...

ఇస్లాం...అంటే...
శత్రువులను ప్రేమించాలని...
ఓర్పువహించాలని దానధర్మాలు చేయాలని
చమటచుక్కలు ఆరకముందే కూలివ్వాలని
అవనిలో అల్లా ఒక్కడే అందరికీ దేవుడని...
విశ్వసించాలని...విధేయులుగా ఉండాలని..

అల్లా...అంటే.....
కరుణామయుడని...
అపార కృపాసాగరుడని...
సర్వలోకాల సృష్టికర్తయని
తీర్పుదినానికి అధిపతియని
మహాజ్ఞానియని...మహిమాన్వితుడని....

ఖురాన్...అంటే...
ఒక పవిత్రగ్రంథమని...
దాన్ని శ్రద్దా పఠించిన వారికి...
ప్రవచనాలన్నీ పాటించిన వారికి...
మరణాంతరం కూడా
సుఖజీవనముంటుందని...
అమృత సందేశాన్నందించిన...
ప్రపంచశాంతికై పరితపించిన...
ఓ ముహమ్మద్ ప్రవక్తా...,
ఓ విశ్వ కారుణ్యమూర్తి...
ఓ దైవాంశ సంభూతుడా...
ఓ సమతా మమతల శాంతి శిఖరమా...
మీకు ప్రణామం...ప్రణామం...ప్రణామం...