Facebook Twitter
. విక్రం ల్యాండర్ విజయగాథ

నిన్న రాత్రి నేను
నింగిలోకి తొంగి చూశా
నా శిరస్సుపైన
నిండు పున్నమి
చంద్రుడున్నాడు
చుక్కల్లో నక్కి ఉన్నాడు
నిండుగా నవ్వుతున్నాడు ...

నేటి రాత్రి నేను
టీవీలోకి తొంగి చూశా
టీవీ చానెల్స్ ఘోషిస్తున్నవి...
అంతరిక్ష నౌక చంద్రయాన్ - 3 
చంద్రుని తలపై అడుగు పెట్టిందని...
చంద్రమా ఇదెంత వింత.,.?
నిన్ను నా తలపై నీవు...
నేడు నీ తలపై మేము...

బాల్యంలో నేను తిండితినకున్న
అమ్మ పాడేది ఓ కమ్మని పాట
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే అని...

అద్దంలో ఆ చంద్రున్ని చూపిస్తూ
కొసకొసరి పెట్టేది గోరుముద్దలు
నాడు అద్దంలో కంటికి కనిపించే
ఆ చంద్రుడు చేత చిక్కడాయె
బాల్యంలో ఒకే ఒక తీరని కోరిక
చంద్రున్ని చేరాలని...చుక్కల్తో ఆడాలని

ఋగ్వేదంలో ఒక శ్లోకం...
చందమామ ఓ చందమామ
నేలకు నీవు దిగిరాలేవు...మేమే
నీ దగ్గరకు వస్తాం దారి చూపమని...

మా శాస్త్రవేత్తల ప్రార్థన ఫలించింది
సంక్లిష్టమైన అతిప్రమాదకరమైన
ఉత్కంఠభరిత దశలెన్నో దాటుకొని
ఎన్నో ఏళ్లుగా సూర్యకిరణాలు తాకని
ఎవరూ చేరని‌...అడుగు పెట్టని
చంద్రుని దక్షిణధృవం పై
దిగ్విజయంగా సురక్షితంగా దిగాయి
"విక్రమ్ ల్యాండర్"..."ప్రగ్యాన్ రోవర్ లు"...
విశ్వమంతా...విస్తుపోయేలా...

ఆ వాయురహిత చల్లని వాతావరణంలో
ముందుకు నడుస్తూ రోవర్ ముద్రించింది
అందమైన ఆ చందమామ గుండెలమీద
ఇశ్రో లోగోను...జాతీయ సింహం చిత్రాన్ని...
ఎన్నేళ్ళైనా చెక్కుచెదరని ఓ గుర్తుగా...
చంద్రునిపై భారత్ నడిచిందని...
ఆనందంతో అడుగులు వేసిందని...
రోదసి సామ్రాజ్యానికి రారాజు భారత్ అని...