ఎందుకో..."నల్లని"రంగు
ఎవరికీ ..,...నచ్చదు...కానీ
నలుపు వెనుక తెలుపు
ఓటమి వెనుక గెలుపు ఉంటుంది
"నల్లని" కాకి నచ్చదెవరికీ...
కారణం దాని అరుపు కర్ణకఠోరం...
తెల్లవన్నీ పాలు..."కావు కావు"
నల్లవన్నీ నీళ్ళు...."కావు కావు"
కష్టపడి ఆశపడి ఆర్జించిన
కోట్లేవీ నీవు..."కావు కావు"
కూడబెట్టిన ఆ ఆస్తులు
అంతస్తులు సిరిసంపదలేవీ
శాశ్వతం..."కావు కావు" అన్నదే
కాకి అందించే నిత్యసత్య సందేశం
కానీ కాటిలో ఆ నల్లని కాకే
కేక పెట్టగానే...వచ్చి వాలాలి
పెట్టిన పిండాన్ని ముట్టుకునేందుకు...
పెద్దల ఆత్మకుశాంతి కలిగించేందుకు...
దాచి ఉంటేనేమి..."నల్లధనం"
ఎక్కడో బ్యాంకు లాకర్లలో
చిమ్మచీకట్లలో స్విస్ బ్యాంకుల్లో
"తెల్లధనంగా" మారిపోవాలంటే...
కొన్ని "పెద్దనోట్లు" కళ్ళుమూసి
కలిసి పోకతప్పదు కాలగర్భంలో...
ఉంటేనేమి..."నల్లగా"..
క్లాసులో బోర్డు...ఆ "నల్లని" బోర్డు మీది
"తెల్లని" అక్షరాలే విద్యార్థుల జీవితాల్లో
రేపు నవ్యకాంతులు విరజిమ్మే నక్షత్రాలు
ఉంటేనేమి.."నల్లగా"..?
కొమ్మల్లో కోయిలమ్మ...
కుహూ కుహూ అంటూ
కూసిందంటే మనసున
విరిసేది... నవవసంతమే...
హృదయంలో ఉప్పొంగేది
ఉల్లాసమే...రోజంతా ఉత్సాహమే...
"నల్లని"...రాముని
"అల్లరి"...కృష్ణుని
"చల్లని"...దీవెనలుంటేనే కదా
ఈ మనిషి జీవితం ఓ
"తెల్లని"...మంచుపర్వతమయ్యేది...
అగాధమౌ జలనిధిలోన
ఆణిముత్యం ఉన్నట్లే...
శోకాల మరుగున దాగి
సుఖమున్నదిలే...అంటూ
ఓ కవి కమ్మగా పలికినట్లుగా...
ఒక సూర్యాస్తమయం వెనుక
ఒక సూర్యోదయముంటుంది...
"నల్లని" కారుచీకట్ల తెరల వెనుక
"చల్లని" వెన్నెల వెలుగు దాగి ఉంటుంది



