వెయ్యి కాగడాలు పెట్టి
వెతుకుతాం చూస్తాం
దూరపు బంధువుల్ని
ఆరాతీస్తాం అడుగుతాం
చక్కని సంబంధాల కోసం
ఎన్నటికీ విడిపోని బంధాలకోసం
ఎవరు ఎవరికి జతౌతారో
ఎవరు ఎవరి మెడలో
ఆ మూడుముళ్ళు వెస్తారో
తెలియదెవ్వరికీ...వేసేంతవరకు
ఆ సంబంధాలు కుదిరేంతవరకు
పైనున్న ఆ పరమాత్మకు తప్ప....
ఔరా ఇది ఎంత వింతో కదా కాదు కాదు
అదొక ప్రకృతిధర్మం...అదొక సృష్టిరహస్యం
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఓ ఇద్దరిని
అదృశ్యంగా జత కుదిర్చేది ఆ పరమాత్మే
ఆదైవం కరుణిస్తేనే కళ్యాణ శోభ
మూడు మూళ్ళుపడేది మేళతాళాలు
మంగళవాయిద్యాలు మ్రోగేది
అక్షింతలు కురిసేది
ఆపై నవదంపతులై మురిసేది
పెళ్ళికి అందరూ రావాలని
పెళ్ళి పందిరిలో అందరినీ కలవాలని
ఆశీర్వదించాలని అక్షింతలు చల్లాలని
ఆశించే కోరుకునే ఆ నవదంపతులు
శోభనం గదికెవ్వరినీ ఆహ్వానించరు ఆ
పవిత్ర కార్యానికి పూజారి ఆ పరమాత్మే
ఔరా ఇది ఎంత వింతో కదా కాదు కాదు
అదొక ప్రకృతిధర్మం...అదొక సృష్టిరహస్యం
కళ్యాణం కమనీయమే
రాత్రంతా రమణీయమే
రసభరితమే రాగరంజితమే
శృంగారమే అర్థరాత్రిలో సుప్రభాతమే
ఆపై ఆ జంట కోరుకునేది ఏకాంతమే
స్వర్గంలోకంలో విహంగాలై విహారమే
అది పవిత్రమైన వివాహమే
కడలిలోకి ఓ నది ప్రవాహమే
కోరికలు తీరితే కన్నకలలు పండితే
ఇక అందమైన అలలకు అన్నప్రాసనే
ఎంతగా ఆశపడినా
ఎంతగా ప్రయాసపడినా
పురిటినొప్పులు పడక తప్పదు
ఆ పైన ఆపరమాత్మ ఏ బహుమతిచ్చినా
పుచ్చుకోక తప్పదు ఇష్టమున్నా లేకున్నా
నవమాసాలు ఆగిన ఆ నవదంపతులు
ఔరా ఇది ఎంత వింతో కదా కాదు కాదు
అదొక ప్రకృతిధర్మం...అదొక సృష్టిరహస్యం
ఆపై ఇద్దరూ సంసార సాగరాన్ని
సంతోషంగా ఈదాలనుకుంటారు
కలిసిజీవితాంతం బ్రతకాలనుకుంటారు
తృప్తిగా ఆవలితీరం చేరాలనుకొంటారు
కానీ ఎవరు ఎప్పుడు మునిగి పోతారో
ఎవరికి ఎవరు ఎందుకు దూరమౌతారో
తెలియదెవ్వరికీ...దూరమయ్యేంతవరకూ
పైనున్న ఆ పరమాత్మకు తప్ప
ఔరా ఇది ఎంత వింతో కదా కాదు కాదు
అదొక ప్రకృతిధర్మం...అదొక సృష్టిరహస్యం



