Facebook Twitter
ఓ దైవమా ‌నీ వెక్కడ?

గర్భగుడిలో ప్రతిష్టించిన 
ఆ సుందరశిల్పం మనిషి చెక్కినదే
దేవుడు సృష్టించిన ఈ మనిషే
తిరిగి ఆ దైవాన్నే సృష్టిస్తున్నాడు

నిజమే కాని మనిషి తన స్వేదాన్ని
చిందించి ఊహించి గొప్పనైపుణ్యంతో
ఉలితో చెక్కిన ఆ సుందర శిల్పానికి
ఉలుకూలేదు పలుకూలేదు ఊపిరిలేదు

తల్లిగర్బంలో తొమ్మిది నెలలుండి
ఆపై తన తల్లి పేగును తెంచుకొని
రక్తం పంచుకొని పుట్టి పెరిగిన బిడ్డ
నిన్న తనకు ప్రాణం పోసిన ఆ దైవాన్నే
నేడు ప్రశ్నిస్తున్నాడు ఓ దైవమా నీవెక్కడాని?

అందుకు దేవుడు
నే నెక్కడో లేను...
నేను నీలోనే వున్నాను...
నీ ఆత్మలో వున్నాను.... 
నీ శ్వాసలో నేవున్నాను...
నీ కంటికి వెలుగైవున్నాను...
నేను లేకుంటే నీవు లేవు...అంటున్నాడు

నీ నుండి నేవెళ్ళిపోతే
నీ గుండె ఆగిపోతుందని...
నీ కళ్ళు మూతపడతాయని...
నీవు కట్టైపోతావని కాటికెళ్తావని...
కాలి బూడిదగా మిగిలిపోతావని...
భూమిలో కలిసిపోతావని...అంటున్నాడు

అందుకే ఓ మనిషీ ! శిల్పినని విర్రవీగకు...
శిల్పాలు చెక్కుతానని... ప్రగల్పాలు పలక్కు...
ముందు అంతుచిక్కని ఓ వింత రహస్యాన్ని తెలుసుకో
నీకా దైవం ఉలినిచ్చాడే కానీ ఊపిరి పోసేశక్తి నివ్వలేదని
ఈసృష్టిలో ఏజీవికైనా ప్రాణంపోసేశక్తి ఆ పరమాత్మేదేనని