ఓ గురు దేవుళ్ళారా !
మేము పుట్టగానే
బడిలో అడుగుపెట్టగానే
పరిమళించే పువ్వులని పసిగట్టేది మీరే
మమ్ము కనని అమ్మానాన్నలు మీరే
మా భవిష్యత్తు భవననిర్మాతలు మీరే
మా జీవిత చక్రాలను తిప్పే
విష్ణుచక్రాలు మీ చేతుల్లోనే
మా దారిలో దీపాలు మీరే
మా జీవితమార్గ నిర్దేశకులు మీరే
మేము చదువుల్లో దిట్టలమైతే
మొట్టమొదట భుజం తట్టేది మీరే
సాన బట్టేది మీరే ముందుకు నెట్టేది మీరే
మమ్ము రాళ్ళలో రత్నాలుగా
మట్టిలో మాణిక్యాలు తీర్చిదిద్దేది మీరే
ఓ గురు దేవుళ్ళారా !
మా ఉజ్వల భవిష్యత్తును నిర్మించేది మీరే
మాలో అభ్యుదయ భావాలను రగిలించేది మీరే
మా హృదయాన్ని వికసింపజేసేది మీరే
ఒక "కన్నతల్లిలా "బుజ్జగించి,బుద్దిచెప్పేది మీరే
ఒక "కన్నతండ్రిలా చేయిబట్టి నడిపించేది మీరే
ఒక "ప్రాణస్నేహితుడిలా" ఎవరెస్టుశిఖరమంత
ఎత్తుకు మేము ఎదగాలని ఆశించేది మీరే
ఆపదలో "భగవంతుడిలా" ఆదుకునేది మీరే
మా బ్రతుకులను బంగారుమయం చేసేది మీరే
ఓగురుదేవుళ్ళారా !
మీరు నేలమీదున్నా మేము మాత్రం
వినువీధుల్లో విదేశాల్లో విమానాలలో
విహరించాలని కలలు కనేది మీరే
ఆ కలలే నిజమై మేము
డాక్టర్లం, సినిమా యాక్టర్లం
కలెక్టర్లం, కంప్యూటర్ ఇంజనీర్లమైతే,
రాజకీయ నేతలమై రాజ్యాలనేలితే
ఉప్పొంగి పోయేది మీ గుప్పెడు మనసే
ఆ కలలే నిజమై మేము
సైంటిస్టులం,అంతరిక్ష పరిశోధకులం
వ్యోమగాములం, మీలా ఉపాధ్యాయులమైతే
పరవశించిపోయేది మీ పసిహృదయాలే
మేము గురువులను మించిన శిష్యులమైతే
"ధీర్ఘాయుష్మాన్ భవా" యని దీవించేది మీరే
ఓ గురుదేవుళ్ళారా !
బ్యాంకులో తీసుకున్న
కోట్ల రుణాన్ని ఈ జన్మలో తీర్చవచ్చు
కాని ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనిది
మాకు జన్మనిచ్చిన అమ్మానాన్నల ఋణం
మాకు ప్రాణం పోసిన ఆ బ్రహ్మ ఋణం
మాకు జ్ఞానామృతం పంచిన మీ ఋణం
ఓ గురుదేవుళ్ళారా !
మీకు రెండు చేతులెత్తి మొక్కుతాం
మీ పాదాలకు పాలాభిషేకం చేస్తాం
మా గుండెల్లో గుడి గట్టి
గురు బ్రహ్మ గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరాః
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువేనమః అంటూ,మిమ్మల్ని
దైవాలుగా ప్రతినిత్యం పూజిస్తాం
మా బిడ్డలకు మీ పేర్లే పెట్టుకుంటాం
ఇదే మీకు మా గురుదక్షిణ
ఇంతకుమించి ఇంకేమిచ్చి
మీ ఋణాన్ని తీర్చుకోగలం, చెప్పండి
ఓ గురుదేవుళ్ళారా ! మీకు వందనాలు !



